Vizianagaram: ఉదృతంగా ప్రవహిస్తున్న నది ఒకవైపు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుమార్తె మరోవైపు. దీంతో తల్లిదండ్రులు సాహస చర్యకు దిగారు. వెదురు కర్రలను పడవగా తీర్చిదిద్దారు. దానిపై సాహస ప్రయాణం చేసి నదిని దాటారు. ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందించారు. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఈ ఘటన ఉమ్మడి విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది. చిన్నారిని కాపాడే ప్రయత్నంలో భాగంగా.. ఆ తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
కొమరాడ మండలం చోళ పదం పంచాయతీ రెబ్బ గ్రామం నాగావళి అవతల ప్రాంతంలో ఉంది. అత్యవసర, అనారోగ్య సమయంలో నది దాటాలంటే పడవ ప్రయాణమే దిక్కు. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పడవ ప్రయాణం బంద్ అయింది. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన కోలక మరియమ్మ అనే బాలిక తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. తరచూ మూర్చ వచ్చి పడిపోతుండడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పడవ లేకపోవడంతో.. వెదురు కర్రలతో తాత్కాలిక పడవని ఏర్పాటు చేశారు.. దానిపై బాలికను పెట్టి.. ప్రమాదపు టంచున ప్రయాణించారు. అతి కష్టం మీద తీరానికి చేరుకున్నారు. అనంతరం 17 కిలోమీటర్ల దూరంలోని ఒడిస్సాలోని రాయగడ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
ఏపీలో ఇటువంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మన్య ప్రాంతంలో డోలియే గతి అవుతోంది. అత్యవసర అనారోగ్య సమయంలో 108 వాహనం కూడా వెళ్లలేని స్థితిలో రహదారులు ఉన్నాయి. అటు ఆసుపత్రుల్లో కూడా మెరుగైన వసతులు లేవు. సుదూర ప్రాంతాల్లోని పట్టణాలకు తీసుకెళ్లి వైద్యమందంచాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ సర్కార్ తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.
ఈ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దుస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి తల్లిదండ్రులను అభినందించారు. వైసీపీ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాల్లో వసతులు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.