Rajinikanth Jailer: సూపర్ స్టార్ రజినీకాంత్ మేనియా గురించి చెప్పాల్సిన పనిలేదు. సౌత్ ఇండియాలోనే అతిపెద్ద హీరోగా ఆయన ఏక ఛత్రాధిపత్యం చేశారు. ఇతర భాషల్లో కూడా ఆయన చిత్రాలకు భారీ మార్కెట్ ఉండేది. చెప్పాలంటే ఫస్ట్ పాన్ ఇండియా హీరో. అయితే కొన్నాళ్లుగా రజినీకాంత్ జోరు తగ్గింది. ఆయన స్థాయి హిట్ పడి దశాబ్దం దాటిపోతుంది. 2.0 అనంతరం ఆ రేంజ్ హిట్ మరలా పడలేదు. ఈ క్రమంలో తెలుగులో ఆయన మార్కెట్ భారీగా పడిపోయింది. ఒకప్పుడు తమిళంతో సమానంగా తెలుగులో వసూళ్లు దక్కేవి.
ప్రస్తుతం కోలీవుడ్ అంటే విజయ్, అజిత్ అన్నట్లు తయారైంది. అయితే రజనీకాంత్ ని తక్కువ అంచనా వేయలేం. తనదైన రోజున ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేస్తాడు. ఆయన లేటెస్ట్ మూవీ జైలర్ భారీ బ్రేక్ ఇస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ అంచనాలకు మించి ఉంది. రజినీకాంత్ క్యారెక్టరైజేషన్ ఆసక్తి రేపింది. ఇక యాక్షన్ అయితే పీక్స్ లో ఉందని చెప్పొచ్చు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న జైలర్ విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇక జైలర్ విడుదలకు ముందే రికార్డులు కొల్లగొడుతుంది. ఈ చిత్రంలోని నువ్వు కావాలయ్యా సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేసింది. 100 మిలియన్ వ్యూస్ క్లబ్ లో చేరింది. 2023లో అత్యంత వేగంగా ఈ మార్క్ చేరుకున్న సాంగ్ గా రికార్డులకు ఎక్కింది. తమన్నా క్రేజీ స్టెప్స్ తో ఆకట్టుకోగా అనిరుధ్ మ్యూజిక్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. సెలెబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా కావాలయ్యా సాంగ్ కి రీల్స్ చేశారు.
కావాలయ్యా సాంగ్ జైలర్ చిత్రానికి మంచి ప్రచారం తెచ్చిపెట్టింది. ఇక జైలర్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించారు. మోహన్ లాల్, రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్, సునీల్ కీలక రోల్స్ చేస్తున్నారు. ఆగస్టు 10న వరల్డ్ వైడ్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. తమన్నా జైలర్ మూవీలో నటిస్తుంది. రజినీకాంత్ వృద్ధుడు పాత్ర చేస్తుండగా తమన్నా రోల్ పై ఆసక్తి పెరిగింది. ఆమెకు పెద్దగా స్క్రీన్ స్పేస్ ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతుంది.
