కడ్తాల్ ఫాంహౌస్ లో జరిగిన పార్టీలో పాల్గొన్నవారిలో 68 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీ నిర్వాహకుల్లో ఒకరైన జీషన్ అలీఖాన్ ఇన్ స్ర్టాగ్రామ్ ద్వారా పార్టీకి సంబంధించిన ప్రకటనలు చేసినట్లు తెలిసింది. సోషల్ మీడియా ద్వారా చాలా మంది అతడిని సంప్రదించి పార్టీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల వరకు వసూలు చేశారని సమాచారం.
కడ్తాల్ ఫాంహౌస్ లో జరిగిన పార్టీలో పాల్గొన్న వారిని విచారించగా వరుణ్ గౌడ్ ఎవరో తమకు తెలియదని చెప్పారు. దీంతో అది పుట్టిన రోజు వేడుక కాదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ పబ్బులన్ని మూతపడడంతో ఈవెంట్ ఆర్గనైజర్లు, కొంతమంది వ్యక్తులు కలిసి ఇలాంటి పార్టీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు ఇందుకు నగర శివారులోని ఫాంహౌస్ లను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
కడ్తాల్ ఫాంహౌస్ లో జరిగిన పార్టీ నిర్వాహకుల్లో ఒకరైన జీషన్ అలీఖాన్ పేరు గతంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో వినిపించింది. అతడే ఇతడా అన్నది తేలాల్సి ఉంది. జీషన్ అలీఖాన్ అలియాస్ జాక్ పై గతంలో నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు గుర్తించారు. 2016లో బహదూర్ పురా పోలీస్ స్టేషన్ లో నకిలీ సర్టిఫికెట్ కేసు, 2018లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు నమోదైనట్లు గుర్తించారు. 2017లో ఎక్సైజ్ పోలీసులు నమోదు చేసిన డ్రగ్స్ కేసులోనూ జాక్ పేరు ప్రముఖంగా వినిపించింది. నగరంలో జరిగే పార్టీలు జాక్ డ్రగ్స్ విక్రయించే వాడని గుర్తించారు. జీషన్ అలీఖాన్, జాక్ ఒక్కరేనా ఇద్దరు వేర్వేరా అన్నది తేలాల్సి ఉంది.