Ratan tata: దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం అక్టోబర్ 9 అర్థరాత్రి ముంబైలోని ఆసుపత్రిలో మరణించారు. టాటా గ్రూప్ ఛైర్మన్ వయస్సు 86 సంవత్సరాలు. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఒక ప్రకటనలో రతన్ టాటా మరణాన్ని ధృవీకరించారు. అతనిని ‘స్నేహితుడు, గురువు’ అని అభివర్ణించారు. గత కొన్ని రోజులుగా ఆయన దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరాడు. బిలియనీర్ హర్ష్ గోయెంకా కూడా రతన్ టాటా మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా మరణానంతరం భారత మీడియానే కాకుండా విదేశీ మీడియా కూడా ఆయన మరణానికి సంబంధించిన వార్తలను ప్రముఖంగా ప్రచురించింది. అంతకుముందు అక్టోబర్ 7న కూడా ఆయన ఆసుపత్రిలో చేరారని.. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ధృవీకరించారు. రతన్ టాటా సోమవారం నాడు తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యల కోసం చెకప్ కోసం వచ్చానని తెలిపారు. టాటా ట్రస్ట్ ద్వారా రతన్ టాటా విద్య, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి, విపత్తు సహాయానికి గణనీయమైన కృషి చేశారు. అతను 1991లో గ్రూప్‌కి నాయకత్వం వహించి, 2012 వరకు రతన్ టాటా కంపెనీకి చైర్మన్‌గా కొనసాగాడు. టాటా గ్రూప్ వ్యాపారం ఇంటి వంటగది నుండి ఆకాశంలో విమానాల వరకు విస్తరించింది 2022లో రతన్ టాటా మొత్తం సంపద రూ.3800 కోట్లు. అతను ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియన్ రిచ్ లిస్ట్‌లో 421వ స్థానంలో ఉన్నాడు.
ఆదాయంలో విరాళమే అధికం
టాటా గ్రూప్‌లో 100 కంటే ఎక్కువ లిస్టెడ్ , అన్‌లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. దీని మొత్తం టర్నోవర్ సుమారు 300 బిలియన్ డాలర్లు. రతన్ టాటా తన సంపాదనలో ఎక్కువ భాగం దాతృత్వానికి విరాళంగా ఇచ్చేవారు. టాటా గ్రూప్‌కు నాయకత్వం వహిస్తూనే, రతన్ టాటా తన వ్యాపారాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం విస్తరించారు. రతన్ టాటా తరతరాల విలువలకు కట్టుబడుతూనే భవిష్యత్తు అవసరాలను సులభంగానే పసిగడతారు.. ఎవరూ ఊహించనంత భారీగానే కాదు.. చిన్న విషయాలనూ శ్రద్ధగా ఆసక్తితో పరిశీలిస్తారు. సరికొత్త ఆలోచనలు, కాసింత తెగింపు ఉంటే చాలు అత్యున్నత శిఖరాలను అందుకోవచ్చని.. ఘనమైన విజయాలను సాధించవచ్చని నిరూపించారు.
అమెరికాలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి..
రతన్ టాటా డిసెంబర్ 28, 1937న ముంబైలో నావల్ హార్మోజీ టాటా, సును దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు. కాంపెయిన్ స్కూల్ లో విద్యను పూర్తి చేసిన తర్వాత, రతన్ ఉన్నత విద్య కోసం అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జీవితం అంటే ఏమిటో కొద్దికొద్దిగా అర్థమైంది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఖర్చులకు పంపే అరకొర డాలర్లు సరిపోకపోయేవి. దాంతో చిన్నాచితకా పనులు చేయాల్సి వచ్చింది. కొంతకాలం అంట్లు కూడా కడిగారు. రతన్ సంపన్న టాటా కుటుంబంలో జన్మించినప్పటికీ అతని కెరీర్ సాధారణ ఉద్యోగిగానే ప్రారంభమైంది. కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్‌లో B.Sc పట్టా పొందిన తరువాత, అతను లాస్ ఏంజిల్స్‌లోని జోన్స్ అండ్ ఎమ్మెన్‌లో కొంతకాలం పనిచేశాడు. ప్రముఖ కంప్యూటర్ కంపెనీ ఐబీఎంలో ఉద్యోగ అవకాశం వచ్చింది. అయితే జేఆర్‌డీ టాటా సలహా మేరకు ఆయన భారత్‌కు వచ్చారు. రతన్ టాటా తండ్రి అప్పటికే టాటా గ్రూప్ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. అయితే రతన్ పెద్ద స్థాయితో కంపెనీలోకి అడుగు పెట్టలేదు.
రతన్ సామర్థ్యాన్ని పసిగట్టి..
జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్ ఉత్పత్తి విభాగంలో ఒక మూమూలు ఉద్యోగిగా చేరారు. వేలాది మంది ఉద్యోగులతో కలిసి నిప్పుల కొలిమి దగ్గర పనిచేశాడు. అలా 1962లో అత్యల్ప స్థాయి నుంచి ప్రారంభమైన అతని ఉద్యోగ జీవితం తొమ్మిదేళ్లపాటు వివిధ ఉద్యోగాలతో అక్కడే కొనసాగింది. 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్(NELCO) డైరెక్టర్‌గా మొదటి అవకాశం వచ్చింది. అయితే ఈ వార్తల్లో సంతోషించాల్సిన పనిలేదు.
ఎందుకంటే కంపెనీ ఇప్పటికే 40 శాతం నష్టపోయింది. దానిని లాభసాటిగా మార్చేందుకు రతన్ తన శాయశక్తులా ప్రయత్నించాడు. జేఆర్డీ ఈ సమయంలో రతన్ సామర్థ్యాన్ని పసిగట్టి ఉండవచ్చు. కంపెనీ అభివృద్ధికి రతన్ ప్రణాళికలకు మద్దతు ఇచ్చారు. సీనియర్లు అభ్యంతరం చెప్పినా పట్టించుకోలేదు. రతన్ పగ్గాలు చేపట్టే సమయానికి నెల్కో ఉత్పత్తులు ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లో కేవలం 2 శాతం మాత్రమే ఉన్నాయి. అమ్మకపు విలువ రూ.3 కోట్లు. రతన్ నిరంతర కృషి ఫలితంగా మార్కెట్ షేర్ 25 శాతానికి చేరుకుంది. 1975లో అమ్మకాల విలువ 113 కోట్లకు పెరిగింది.
రతన్ కార్యదీక్ష, దూరదృష్టి
జేఆర్డీ టాటా రతన్ కార్యదీక్ష, దూరదృష్టిని చూసి ముచ్చటపడ్డారు. నష్టాల్లో ఉన్న కంపెనీలను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించడం.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి అవసరాలను అంచనా వేయడం చాలా ఆకట్టుకుంటుంది. మరీ ముఖ్యంగా, రతన్ తనలాగే ఆలోచించడం జేఆర్డీకి ఇష్టం. అతని జ్ఞాపకశక్తి మీద చాలా నమ్మకం కలిగించింది. అందుకే 1981లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగి తన వారసుడిగా రతన్ టాటా పేరును ప్రతిపాదించారు. దీంతో రతన్ అనూహ్యంగా టాటా గ్రూప్ టాప్ స్థానానికి చేరుకున్నారు.