Ashok Gajapathi Raju latest news: సాధారణంగా రాజుల దర్పం వేరేలా ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కో శైలి కూడా. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు( Ashok gajapathi Raju ) అదే తీరు. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. సాధారణ జీవితం గడుపుతుంటారు. విజయనగరం సంస్థానాధీశుడిగా లక్షల ఎకరాల భూములు, వేలకోట్ల ఆస్తులకు సంబంధించి అధినేతగా ఉన్నారు. కానీ సాధారణ జీవితం వైపే మొగ్గు చూపారు. తన కారు తానే తుడుచుకునేవారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో.. ఎక్కడా అవినీతి మరక లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. భాగస్వామ్య పక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి గవర్నర్ పదవి ఇచ్చింది. తెలుగుదేశం ఏకాభిప్రాయంతో అశోక్ గజపతిరాజు పేరును సిఫారసు చేసింది. దీంతో కేంద్రం అధికారికంగా ఆయన పేరు ప్రకటించింది.
Also Read: రాజ్ భవన్ లోకి రాజావారు.. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు!
కేంద్రం కీలక నిర్ణయం
గవర్నర్లతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ లను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వారి పేర్లను ప్రకటించింది. అయితే నాలుగు రోజుల కిందట పేర్లను ఖరారు చేస్తూ వారి అభిప్రాయాలను తీసుకోవాలని భావించింది కేంద్రం. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి( president ) వీరు పేర్లను ప్రతిపాదిస్తుంది. అశోక్ గజపతిరాజు పేరును ఖరారు చేసి పంపడంతో రాష్ట్రపతి కార్యాలయం అశోక్ గజపతి రాజును సంప్రదించే ప్రయత్నం చేసింది. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కార్యాలయం నుంచి కూడా అశోక్ ను సంప్రదించే ప్రయత్నం చేశారు. ఆయన సైతం అందుబాటులోకి రాలేదు. దీంతో వేరే మార్గంలో అశోక్ గజపతి రాజుకు సమాచారం అందించారు.
Also Read: బనకచర్ల : ఏపీ, తెలంగాణ మధ్య ఓ వరదనీటి వివాద కథ
విజయనగరం ఎంపీ ద్వారా సమాచారం..
కొద్ది రోజుల కిందట సింహాచలం( Simhachalam) గిరి ప్రదక్షణ జరిగిన సంగతి తెలిసిందే. సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా అశోక్ ఉన్నారు. సింహాచలంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలోనే రాష్ట్రపతి కార్యాలయం నుంచి అశోక్ గజపతిరాజుకు ఫోన్ కాల్ వచ్చింది. అయితే కేవలం సన్నిహితులు, అతి దగ్గర వ్యక్తుల ఫోన్ నెంబర్లు మాత్రమే సేవ్ చేసుకుంటారు అశోక్. ఇతరులు ఫోన్ చేసినా ఆయన స్పందించరు. రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్ కు కూడా ఆయన స్పందించలేదు. తర్వాత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కార్యాలయం నుంచి కూడా ఫోన్ వచ్చింది. దానిని కూడా రిసీవ్ చేసుకోలేదు. దీంతో విజయనగరం ఎంపీ కలిశేట్టి అప్పలనాయుడు కు ఫోన్ చేసి.. అశోక్ గజపతిరాజు భార్య ద్వారా ఆయనకు సమాచారం అందించగలిగారు. మిమ్మల్ని గవర్నర్ గా ఎంపిక చేశారు.. ఆ బాధ్యతలను స్వీకరించండి అంటూ అక్కడి రాష్ట్రపతి కార్యాలయ అధికారులు కోరారు. అయితే ఐదు నిమిషాలు ఆగండి అంటూ అశోక్ వారిని కోరారు. వెంటనే పార్టీ అధినేత చంద్రబాబుకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఆ తరువాత గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.