Banakacharla Project :కేంద్రంలో మూడోసారి ఏన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. గత రెండు పర్యాయాలు కూటమిలోని పార్టీలతో సంబంధం లేకుండా బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. కానీ 2024 ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. ఫలితంగా కూటమిలోని టీడీపీ, జేడీయూ కీలకంగా మారాయి. వీటి మద్దతు లేకుంటే కేంద్రంలో ఎన్టీఏ ప్రభుత్వం నిలబడలేదు. దీనినే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నాడు. ఇప్పటికే కేంద్రం టీడీపీ, జేడీయూలకు మంచి ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పుడు చంద్రబాబు ఇదే అవకాశాన్ని ఉపయోగించుకుని కేంద్రం మద్దతులో గోదావరి జలాలు ఏపీకి తరలించుకుపోయే ప్లాన్ వేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయించారు.
Also Read: ఆ 72 చోట్ల డేంజర్ జోన్ లో ఎమ్మెల్యేలు.. సంచలన సర్వే!
షాక్ ఇచ్చిన తెలంగాణ..
గోదావరి జలాలను తరలించుకుపోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించిన గేమ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఆదిలోనే చెక్ పెట్టింది. కేంద్రాన్ని మెప్పించి, ఒత్తిడి తెచ్చి బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చుకోవాలనుకున్న బాబు ప్లాన్‌కే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బ్రేక్ వేశారు.
చంద్రబాబు కలల ప్రాజెక్టు..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గోదావరి వరద జలాలను బనకచర్ల ద్వారా రాయలసీమకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. 80 లక్షల మందికి తాగునీరు, 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు గోదావరి జల వివాద ట్రైబ్యూనల్ అవార్డు,ఆంధురప్రదేశ్ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉందని తెలంగాణ అభ్యంతరం చెబుతోంది. గట్టిగా వాదిస్తోంది. చంద్రబాబు మాత్రం, ‘‘మేం వరద నీటిని మాత్రమే తీసుకుంటున్నాం, తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు’’ అంటూ కేంద్రానికి లేఖలు రాసి, పీఎంకేఎస్‌వై పథకం కింద నిధులు కావాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ‘వరద నీటి’ కథను నమ్మడంలేదు. ‘‘ఇది నీటి హక్కుల దోపిడీ’’ అంటూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖల మీద లేఖలు రాసింది.
తాజాగా బనకచర్ల ఎజెండాకు బై–బై..
తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గడం లేదు. కేంద్రం జలశక్తి మంత్రిత్వ శాఖ, ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి, బనకచర్లపై చర్చించాలని ప్రతిపాదించింది. కానీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీమ్ గట్టిగా ‘‘నో’’ అనేసింది! ‘‘బనకచర్లపై మాట్లాడేది లేదు, అదే ఎజెండా అయితే సమావేశానికి రాము’’ అని కేంద్రానికి తాజా లేఖలో స్పష్టం చేసింది. ఇది చంద్రబాబుకు మాత్రమే కాదు, కేంద్రానికి కూడా ఊహించని షాక్!
బనకచర్ల ప్రాజెక్టు స్వరూపం…
బనకచర్ల ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రతిష్టాత్మక జలసంధాన పథకం. ఇది గోదావరి నది వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించడానికి ఉద్దేశించబడింది. ఈ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టుతో అనుసంధానించబడి, వృథాéగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి నీటిని సాగు, తాగునీటి అవసరాల కోసం ఉపయోగించాలనే లక్ష్యంతో రూపొందించబడింది.
లబ్ధి పొందే జిల్లాలు
ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలకు లబ్ధి కలుగుతుంది. తాగు, సాగునీటి సౌకర్యం కలుగుతుంది.
Also Read: ఆంధ్రా అనుకూల పత్రికలకు.. రేవంత్ సర్కార్ ప్రకటనలు.. ఇదీ ప్రజా పాలన!
ప్రాజెక్టు స్వరూపం
బనకచర్ల ప్రాజెక్టు మూడు దశల్లో చేపట్టబడుతుంది.
మొదటి దశ..
పోలవరం ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్న పవిత్ర సంగమం వరకు తాడిపూడి వరద కాలువ ద్వారా 175 కిలోమీటర్ల మేర నీటిని తరలిస్తారు. ఈ దశలో 18 వేల క్యూసెక్కుల డిశ్చార్జ్‌తో నీరు గ్రావిటీ ద్వారా సరఫరా చేయబడుతుంది. దీనికి 1,401 ఎకరాల భూమి అవసరం, దీని ఖర్చు సుమారు రూ. 13,800 కోట్లు.
రెండో దశ..
సాగర్ కుడి కాలువ నుంచి 96.5 కిలోమీటర్ల వద్ద నీటిని లిఫ్ట్ చేసి, పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి వద్ద కొండల్లో నిర్మించే రిజర్వాయర్‌కు తరలిస్తారు. ఈ రిజర్వాయర్ 150 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ దశలో 23 వేల క్యూసెక్కుల డిశ్చార్జ్‌తో నీరు సరఫరా చేయబడుతుంది.
మూడో దశ..
బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమల అడవుల మీదుగా బనకచర్ల రెగ్యులేటర్‌కు నీరు తరలిస్తారు. ఈ దశలో 368.60 కిలోమీటర్ల ఓపెన్ కాలువ, 20.50 కిలోమీటర్ల మెయిన్ టన్నెల్, 6.60 కిలోమీటర్ల సిద్ధాపురం ట్విన్ టన్నెల్స్, 17 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు కోసం 9 లిఫ్ట్‌లు ఉపయోగించబడతాయి, 3,377 మెగావాట్ల విద్యుత్ అవసరం.