Bride Shortage Survey: పెళ్లెపుడవుతుంది బాబు.. నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు అంటూ ఓ సినీకవి 25 ఏళ్ల క్రితమే పాట రాశాడు. స్త్రీ, పురుష జనాభా నిష్పత్తిలో వ్యత్యాసం కారణంగా భవిష్యత్‌ను ఆ కవి రెండు దశాబ్దాల క్రితమే అంచనా వేశాడు. ఆయన ఊహించినట్లే ఇప్పుడు జరుగుతోంది. దేశంలో పెళ్లి కాని ప్రసాద్‌లు పెరిగిపోతున్నారు. అమ్మాయిల కొరతతోపాటు ఉన్నత విద్య, ఆలస్య వివాహాలు, తగ్గుతున్న జనన రేటు వంటి అంశాలు కూడా ఇందుకు కారణమని 2022లో నిర్వహించిన జాతీయ సర్వే వెల్లడించింది.
ఉన్నత విద్య, జీవిత లక్ష్యాలు…
ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు పెద్దలు.. అలా అయితేనే ప్రకృతి నియమం పాటించినట్లు అని చెబుతారు. కానీ, పెద్దల మాటను ఇప్పుడు ఎవరూ లెక్క చేయడం లేదు. ఆధునిక భారతదేశంలో ముఖ్యంగా మహిళలు ఉన్నత విద్యను అభ్యసిస్తూ, కెరీర్‌పై దృష్టి సారిస్తున్నారు. జాతీయ సర్వే ప్రకారం, యుక్త వయస్సు జనాభాలో 51.1% మంది పెళ్లి కాకుండా ఉన్నారు, ఇందులో పురుషులు 56.3%, మహిళలు 45.7% ఉన్నారు. విద్యాస్థాయి పెరిగే కొద్దీ, వివాహ వయస్సు కూడా పెరుగుతోంది, ఎందుకంటే యువత వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాలకు ప్రాధాన్యత ఇస్తోంది. మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం, కెరీర్ అవకాశాలను కోరుకోవడం వల్ల వివాహాలు ఆలస్యమవుతున్నాయి.
Also Read: Tragedy of a married Woman : వీడు భర్త కాదు కర్కోటకుడు.. రాక్షసుడిలా…
మారుతున్న జీవనశైలి..
నగరీకరణ వేగవంతం కావడంతో, జీవన వ్యయం పెరిగింది. ఇది చిన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి దారితీసింది. నగర యువత, ముఖ్యంగా మహిళలు, వివాహం, సంతానోత్పత్తికి బదులుగా వ్యక్తిగత స్వేచ్ఛ, జీవనశైలిపై దృష్టి సారిస్తున్నారు. ఇదే సమయంలో పెద్ద కుటుంబాలను ప్రోత్సహించే సామాజిక నీతులు మారుతున్నాయి. ఒంటరి జీవనం, విడాకులు, లేదా వివాహం లేకుండా ఉండటంపై సమాజం దృక్పథం మారుతోంది. ఈ మార్పు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ(47.5%), ఆంధ్రప్రదేశ్ (43.7%)లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ పెళ్లికాని జనాభా గణనీయంగా ఉంది. జాతీయ సర్వే ప్రకారం, 3.3% జనాభా వివాహం తర్వాత విడాకులు తీసుకోవడం లేదా ఒంటరిగా జీవిస్తున్నారు.
పడిపోతున్న సంతానోత్పత్తి..
లేట్ మ్యారేజీలు, చిన్న కుటుంబాల ప్రాధాన్యత పెరగడం కారణంగా మన దేశంలో సంతానోత్పత్తి తగ్గుతోంది. 2022 నాటికి 2.0కి పడిపోయింది, ఇది జనాభా స్థిరీకరణకు అవసరమైన 2.1 స్థాయి కంటే తక్కువ. తెలుగు రాష్ట్రాలలో పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో 1.5గా ఉండగా, తెలంగాణలో కూడా ఇదే ధోరణి కనిపిస్తుంది. ఈ తగ్గుదల దక్షిణ రాష్ట్రాలలో ముఖ్యంగా స్పష్టంగా ఉంది. తక్కువ జనన రేటు, పెరిగిన జీవన ఆయుష్షు కారణంగా, భారతదేశంలో వృద్ధ జనాభా (60 ఏళ్లు పైబడినవారు) పెరుగుతోంది. 2022లో, దేశవ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన వారు 9% ఉన్నారు. ఇది 2050 నాటికి 20.8%కి పెరుగుతుందని అంచనా. తెలంగాణలో 8.8% (12వ స్థానం), ఆంధ్రప్రదేశ్‌లో 10.1% (6వ స్థానం) వృద్ధ జనాభా ఉంది.
Also Read: House Income: ఇంటికి దీపమే కాదు.. ఆదాయాన్ని పెంచేది కూడా ఇల్లాలే.. ఎలాగంటే?
తగ్గుతున్న 14 ఏళ్లలోపు జనాభా..
మరొక ఆందోళనకరమైన విషయం ఏమిటంటే 14 ఏళ్లలోపు జనాభా తగ్గుతోంది. 1971 నుంచి 2022 వరకు, 14 ఏళ్లలోపు బాలల జనాభా 41.2% నుంచి 24.7%కి తగ్గింది. బిహార్‌లో ఈ శాతం 32.4%తో అత్యధికంగా ఉండగా, తెలంగాణలో 20.8%, ఆంధ్రప్రదేశ్‌లో 19.7%గా ఉంది.