Chennamaneni Ramesh Babu: అయ్యో చెన్నమనేని.. వేములవాడలో ఇంత పనైందేంటి?

తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు పవర్ పాలిటిక్స్, మరోవైపు హిమాన్షురావు టాపిక్ హాట్ హాట్ గా సాగుతోంది. అయితే ఈ మధ్యలో సడన్ గా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ప్రస్తావన చర్చనీయాంశంగా మారింది.

Written By: Bhaskar, Updated On : July 15, 2023 12:54 pm

Chennamaneni Ramesh Babu

Follow us on

Chennamaneni Ramesh Babu: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఈసారి హ్యాట్రిక్ సాధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆ దిశగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందుకే ఎంత కష్టమైనప్పటికీ తన సర్వేలో ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో బాగానే చాలామందికి ఇన్ డైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది.. అయితే ముఖ్యమంత్రి సంకేతాలు ఇవ్వడంతో కొంతమంది పార్టీలో ఉండకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇలా ఎన్నికల మొదట అధికార భారత రాష్ట్ర సమితిలో రోజుకు ఒక నాయకుడు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు.. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కారు దిగి బయటికి వచ్చేసారు. ఇదే బాటలో కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

చెన్నమనేని వంతు

తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు పవర్ పాలిటిక్స్, మరోవైపు హిమాన్షురావు టాపిక్ హాట్ హాట్ గా సాగుతోంది. అయితే ఈ మధ్యలో సడన్ గా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ప్రస్తావన చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. భారత రాష్ట్ర సమితి తరపున తాను చేసిన నిరసనలో రమేష్ బాబు అసంతృప్తిని బయటకి వెళ్లగక్కారు. “వచ్చే ఎన్నికల్లో టికెట్ అనేది నా చేతిలో లేదు. పార్టీ అధిష్టానం చేతిలో ఉంది. కాక పోతే నా ప్రణాళిక నాకుంది. నేను పక్కకు వెళ్లి పోవాలని కొంతమంది చూస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు చెబుతున్నా.. దొంగలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. నాకు అన్నీ తెలుసు. నాకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉంది. ఏ పదవి మీదా నాకు వ్యామోహం లేదు. భారత రాష్ట్ర సమితిలో కొందరు అటూ ఇటూ ఉంటున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా పర్వాలేదు.. నేను లేకపోతే ప్రజల భూములు కబ్జా చేస్తారు. ప్రజల ఆస్తులుకు అభ్యర్థి చేస్తే మాత్రం ఊరుకోను.” అని రమేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

అందుకే వ్యాఖ్యలు చేశారా

చెన్నమనేని రమేష్ బాబు వ్యాఖ్యల్లో ఓకింత నిర్వేదం కనిపిస్తోంది. ఆయన ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి బయటికి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. “అన్నింటికీ మించి నా దారులు నాకు ఉన్నాయి. భారత రాష్ట్ర సమితిలో కొందరు అటూ ఇటూ ఉంటున్నారు” అని ఆయన చెప్పడం ఆసక్తికరంగా మారాయి. భారత రాష్ట్ర సమితి టికెట్ ఇవ్వకపోతే వేరే పార్టీలోకి వెళ్లయినా సరే పోటీ చేస్తానని రమేష్ బాబు పరోక్షంగా చెప్పినట్టు కనిపిస్తోంది. అయితే ఒకటి రెండు రోజుల్లో కేసీఆర్ 80 మందితో కూడిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేయబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఆ జాబితాలో పేర్లు లేని వారే అధిష్టానం మీద తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారని తెలుస్తోంది.

తెరపైకి ప్రతిమ శ్రీనివాసరావు

అయితే వేములవాడ నియోజకవర్గం నుంచి ఈసారి ప్రతిమ గ్రూపు సంస్థల అధినేత శ్రీనివాసరావును పోటీ చేయించాలని యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈయన కేసీఆర్ కుటుంబానికి అత్యంత దగ్గర వ్యక్తి కావడం.. రమేష్ బాబు మీద భారత పౌరసత్వానికి సంబంధించిన ఆరోపణలు ఉండడం.. నేపథ్యంలోనే కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ మధ్య భారత రాష్ట్ర సమితికి సంబంధించిన హెలికాప్టర్ ను శ్రీనివాసరావు కొనుగోలు చేసి యాదాద్రి గుడిలో పూజలు చేయించారు. వరంగల్ దామెర క్రాస్ రోడ్ లో ఏర్పాటుచేసిన ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఇవన్నీ కూడా ఆయన రాజకీయ ఆగమనానికి సంకేతాలని భారత రాష్ట్ర సమితి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కెసిఆర్ సొంత సామాజిక వర్గం నుంచి మొన్న జూపల్లి కృష్ణారావు, నిన్న చెన్నమనేని రమేష్ బాబు నిరసన గళం వినిపించడం, అది కూడా ఎన్నికలకు ముందే కావడం తెలంగాణ వ్యాప్తంగా చర్చినీయాంశంగా మారాయి.