Kanna Vs Rayapati : కన్నా ఎఫెక్ట్…వైసీపీలోకి రాయపాటి కుటుంబం?

సత్తెనపల్లి నుంచి కుమారుడు రంగబాబును రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు రాయపాటి సోదరుడి కుమార్తె, అమరావతి ఉద్యమ నాయకురాలు డాక్టర్ శైలజా సైతం టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. కానీ ఇంతవరకూ గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఈ నేపథ్యంలో రాయపాటి కుటుంబం ఒక స్ట్రాంగ్ డెసిషన్ కు వచ్చే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : July 15, 2023 12:49 pm
Follow us on

Kanna Vs Rayapati : ఏ నాయకుడికైనా పదవులే ముఖ్యం. రాజకీయంగా కలిసివచ్చే పార్టీనే ఎంచుకుంటారు. సిద్ధాంతాలతో అస్సలు పని ఉండదు. ప్రస్తుతం ఆ పెద్ద మాట రాజకీయాల్లో అంతగా వర్కవుట్ కావడం లేదు. అందుకే తమకు గుర్తింపునిచ్చే పార్టీలను వెతుక్కుంటూ నేతలు వెళ్లిపోతున్నారు. ఏపీలో  ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ తరహా నేతలు కనిపిస్తున్నారు. ముందుగానే పార్టీల్లో చేరి టిక్కెట్లకు కర్చిఫ్ వేస్తున్నారు. ఉన్న పార్టీలో అవకాశాలు లేవని తెలిస్తే చాలూ .. ప్రత్యర్థి పార్టీలకు రాయభారం పంపుతున్నారు. వచ్చేస్తామంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. అన్ని పార్టీల్లో ఇటువంటి నాయకులు ఉన్నారు. బయటకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు రాయపాటి సాంబశివరావు కుటుంబం వైసీపీలో చేరుతుందన్న ప్రచారం ఊపందుకుంటోంది. ప్రస్తుతం టీడీపీ హైకమాండ్ పై రాయపాటి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇవ్వాలని రాయపాటి చంద్రబాబుకు మొర పెట్టుకున్నారు. కానీ ఆయన నుంచి పెద్దగా సానుకూలత రావడం లేదు. చాలాసార్లు రాయపాటి బాహటంగా అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు లైట్ తీసుకున్నారు. పెద్దాయనను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో రాయపాటి అలక కాస్తా అసంతృప్తిగా మారిపోయింది.

పైగా తనకు రాజకీయ ప్రత్యర్థి అయిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి వచ్చారు. అలా వచ్చిన కన్నాకు సత్తెనపల్లి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో కన్నాయే అభ్యర్థి అని సంకేతాలిచ్చారు. అయితే ఆ సీటు రాయపాటి కుమారుడు రంగబాబు ఆశిస్తున్నారు. కానీ చంద్రబాబు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా కన్నాను పార్టీలోకి రప్పించి అప్పగించడంపై రాయపాటి ఆగ్రహంగా ఉన్నారు. చంద్రబాబు తనను లెక్కచేయడం లేదన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే పార్టీ మారేందుకు డిసైడయినట్టు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉన్నారు. రాజకీయంగా రాయపాటికి ప్రియమైన శిష్యుడు ఆయన. అందుకే డొక్కా ద్వారా వైసీపీలోకి వెళ్లేందుకు రాయపాటి మార్గం సుగమం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. సత్తెనపల్లి నుంచి కుమారుడు రంగబాబును రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు రాయపాటి సోదరుడి కుమార్తె, అమరావతి ఉద్యమ నాయకురాలు డాక్టర్ శైలజా సైతం టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. కానీ ఇంతవరకూ గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఈ నేపథ్యంలో రాయపాటి కుటుంబం ఒక స్ట్రాంగ్ డెసిషన్ కు వచ్చే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.