విజయవాడ నగరంలోని కరోనా ఉధృతి రాజ్ భవన్ కు చేరింది. గవర్నర్ పేటలో ఉన్న రాజ్ భవన్ లో పని చేస్తున్న వారిలో అనుమానిత లక్షణాలు కలిగి ఉండటంతో ఉన్నతాధికారులు పరీక్షలకు ఆదేశించారు. పరీక్షల అనంతరం నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వీరిని క్వారంటైన్ కు తరలించారు. వైరస్ భారిన పడిన వారిలో రాజ్ భవన్ చీఫ్ సెక్యూరిటీ అధికారి, వైద్య సిబ్బందిలో ఒకరు, ఇద్దరు పని మనుషులు ఉన్నారు. మొత్తం ఎనిమిది మందికి పరీక్షలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కూడా కరోనా స్వాబ్ టెస్టింగ్ చేయించుకోగా ఆయనకు నెగిటివ్ వచ్చినట్లుగా సమాచారం.
కరోనా పాజిటివ్ గా తేలిన సిబ్బంది పనిచేసిన ప్రాంతాల్లో రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి అవసరమైన రసాయనాలను రాజ్ భవన్ ఆవరణలో పిచికారీ చేయడం కొద్దిరోజుల కిందటే అధికారులు ప్రారంభించారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా రాజ్ భవన్ లోకి కరోనా వైరస్ చేరడం ఆందోళన కలిగిస్తోంది.