AP Rain Alert: ఆంధ్రప్రదేశ్ ను తుపాన్ ముప్పు వీడటం లేదు. ఇప్పటికే నాలుగు జిల్లాలను అతలాకుతలం చేసిన వరద బీభత్సంతో ప్రజలు గూడు లేని వారయ్యారు. అయినా ఇంకా తుపాను ప్రభావం వెంటాడుతూనే ఉంది. ఆదివారం తెల్లవారు జాము నుంచి భారీ వర్షాలు ప్రకాశం, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలను కుంభవృష్టి ముంచెత్తుతోంది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రోడ్లన్ని జలమయం అవుతున్నాయి. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. నవంబర్ 30 లేదా డిసెంబర్ 1న ఏపీ దక్షిణ ప్రాంతం, తమిళనాడు ఉత్తర తీర ప్రాంతం మధ్య తీరం దాటి దాని ప్రభావం చూపించవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read: ఏపీకి పొంచి ఉన్న మరో భారీ ముప్పు
రాయలసీమ జిల్లాల్లో జలకళ సంతరించుకుంటోంది. అనంతపురం జిల్లాలో కూడా గరిష్ట స్థాయి నీటిమట్టం పెరుగుతోంది. కడప జిల్లాలో అదే పరిస్థితి నెలకొంది. తిరుపతి జలమయమైంది. అధికార యంత్రాంగం అప్రమత్తమైనా జరగాల్సిన నష్టం మాత్రం జరిగింది. రాష్ర్టం మొత్తం అతలాకుతలం అవుతోంది.
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కడప జిల్లాలో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదకూరు, రాజంపేట, రాయచోటి, పులివెందుల, అనంతపురం జిల్లా కదిరి, గోరంట్ల, హిందూపురం ప్రాంతాలు భారీ వర్షాల ధాటికి నష్టపోయాయి.