
దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెల్సిందే. ఏప్రిల్ 14వరకు తొలి విడుత లాక్డౌన్ కొనసాగింది. ఇక రెండో విడుతగా మే3వరకు లాక్ డౌన్ ఉంటుందని ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో దేశంలోని రైళ్లు, బస్సులు, విమాన సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మే 3వరకు రైళ్లు, విమానాలు నడపబోమని రైల్వే శాఖ, ఎయిర్ లైన్స్ ప్రకటించాయి. లాక్ డౌన్ పిరియాడ్లోనే రైల్వే శాఖ రెండు స్పెషల్ ట్రైన్స్ నడిపించేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 17, 18తేదిల్లో రెండు స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు ప్రకటించింది.
ఉత్తర, ఈశాన్య ప్రాంతాలకు శిక్షణ పూర్తి చేసుకున్న సైనికులను సరిహద్దులకు చేర్చేందుకు రెండు స్పెషల్ ట్రైన్లు నడిపేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్రం హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. 17న నడిచే ట్రైన్ బెంగళూరు-బెల్గాం-సికింద్రాబాద్-అంబాల-జమ్ము మీదుగా ప్రయాణించి 20న గమ్యస్థానానికి చేరుతుంది. 18న నడిచే ట్రైన్ బెంగళూరు-బెల్గాం-సికింద్రాబాద్-గోపాల్పూర్-హౌరా-న్యూజల్పాయ్గురి-గువాహటి మీదుగా 20న గమ్యస్థానానికి చేరుతుందని రైల్వేశాఖ తెలిపింది. వీరిని క్వారంటైన్లో ఉంచి, ఫిట్ అని తేలిన తర్వాతే విధుల్లోకి తీసుకుంటామని తెలిపాయి. ప్రత్యేకవసరాల దృష్ట్యా రానున్నా రోజుల్లో మరిన్ని రైళ్లను నడిపించేందుకు కేంద్రం సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.