
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీని పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే పోలీసులు కేసు నమోదు చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు ఖండిస్తున్నారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే పోడెం వీరయ్యను టీఆర్ఎస్ ప్రభుత్వం కేసులుపాలు చేయాలని చూస్తుందని పలువురు కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భద్రాచలంలోని జగదీశ్ కాలనీలో వలస కార్మికులు, పేదలు ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ఓ స్వచ్చంధ సంస్థ నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరయ్య కూడా హాజరయ్యారు. దీంతో పోలీసులు నిత్యావసరాల పంపిణీలో సామాజిక దూరం పాటించడం లేదని, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎమ్మెల్యేతోపాటు 25మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమపై కేసు నమోదు చేయడాన్ని ఎమ్మెల్యే ఖండించారు. పేదలకు సరుకులు పంపిణీ చేస్తే కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కరోనా పేరుతో కేసులు నమోదు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. వెంటనే బేషరతుగా కేసులను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.