Wayanad by election : నవ్య హరిదాస్ 2007లో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తి చేశారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. కోజికోడ్ లో కార్పొరేషన్ కు రెండుసార్లు కౌన్సిలర్ గా ఎంపికయ్యారు. ఆ కార్పొరేషన్ లో బిజెపి పక్ష నేతగా ఆమె కొనసాగుతున్నారు. బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆమె ఇటీవల నియమితులయ్యారు. 2021లో కోజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమెకు వాగ్దాటి ఎక్కువగా ఉంటుంది. ఏ అంశంపై నైనా అద్భుతంగా మాట్లాడుతారు. అనేక విషయాలపై ఆమెకు పట్టుంది. అయితే మన దేశంలో హేమాహేమీలైన మహిళలు ఎన్నికల్లో పోటీ పడటం ఇదే తొలిసారి కాదు. 1999లో కర్ణాటకలోని బళ్లారి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పై బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్ పోటీ చేశారు. ఆ పోటీలో నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం చేశారు. చివరికి బళ్లారి ప్రజలు సోనియా గాంధీ వైపు మొగ్గు చూపించారు. ఆ ఎన్నికల్లో ఆమె 60 నుంచి 70 వేల మెజారిటీ మధ్య విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో సుష్మ స్వరాజ్ కేవలం 15 రోజుల్లోనే కన్నడ భాష నేర్చుకొని.. ఎన్నికల సభల్లో కన్నడలో ప్రసంగించారు. ఆమె బళ్ళారి నియోజకవర్గ నుంచి ఓడిపోయినప్పటికీ.. దాదాపు తాను మరణించేవరకు కర్ణాటక నుంచి ఎవరు వచ్చినా సరే.. కన్నడలో మాట్లాడేవారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పలుమార్లు కర్ణాటకలో పర్యటించారు. ఆ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారు. అక్కడ గెలిచిన కొంతకాలానికి సోనియాగాంధీ రాజీనామా చేసి.. ఉత్తరప్రదేశ్లోని ఆమేది నియోజకవర్గానికి వెళ్లిపోయారు.
పాతికేళ్ల తర్వాత..
నాటి బళ్ళారి ఎన్నికల జరిగిన పాతిక సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు దేశం మొత్తం వయానాడ్ వైపు చూస్తోంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చింది. రాహుల్ గాంధీ ఈ స్థానంలో గెలిచినప్పటికీ రాజీనామా చేశారు.. దీంతో ఆయన సోదరి ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి పోటీ చేస్తున్నారు. బిజెపి నుంచి స్థానికరాలు నవ్య హరిదాస్ పోటీలో ఉన్నారు. ప్రియాంక గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నానమ్మ ప్రధానిగా, ముత్తాత ప్రధానిగా, తండ్రి ప్రధానిగా, తల్లి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా, సోదరుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా కొనసాగారు. మొత్తంగా చూస్తే దేశ రాజకీయాలను ఆమె కుటుంబం శాసించింది.
ఉన్నత విద్యావంతురాలు
ఇక నవ్య హరిదాస్ ఉన్నత విద్యావంతురాలు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుంది. మలయాళం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరినాడు బళ్లారి ఉప ఎన్నికల్లో తన తల్లి సోనియాగాంధీ కన్నడ ప్రజలకు చేరువైనట్టు. నేడు మలయాళ ప్రజలకు ప్రియాంక గాంధీ దగ్గరవుతుందా.. స్థానికు రాలైన నవ్య హరిదాస్ పై పై చేయి సాధిస్తుందా? అనేది వేచి చూడాల్సి ఉంది. వయనాడ్ లో ఇటీవల వరదలు సంభవించినప్పుడు తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక గాంధీ వచ్చారు. అక్కడి ప్రజలను పరామర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కేరళలో పర్యటించారు. వయనాడ్ లో జరిగిన నష్టాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే కేంద్రం నుంచి సహాయక సహకారాలు అందించారు. నవ్య హరిదాస్ కూడా మహిళా మోర్చా తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటికీ ఆమె రాష్ట్రంలో సమస్యలను వివిధ వేదికల ద్వారా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ చేస్తున్న తప్పులను ఎండగడుతున్నారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న వయానాడ్ నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ జై కొడతారా.. లేకుంటే నవ్య హరిదాస్ ను గెలిపించి.. సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుడతారా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.