Batti Vikramarka : తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక్కతాటిపైకి వస్తున్నారు. కర్ణాటకలో గెలుపు వారిని ఏకం చేసింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగేలా చేస్తోంది. ఎప్పుడో వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్లీ ఇప్పుడు అదే ఊపు వస్తోంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి సారథ్యంలో, శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క తోడుగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతోంది. మరోసారి అధికారం కోసం ఈసారి గట్టి ప్రయత్నాలే చేస్తోంది.
దివంగత వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఉమ్మడి ఏపీలో నిలబెట్టారు. అంతటి బలమైన నేత పాలనలో సంక్షేమ రాజ్యం వెల్లివిరిసింది. మళ్లీ అలాంటి బలమైన నేతల లోటు కాంగ్రెస్ ను వేధించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక అది మళ్లీ మొదలైంది.
రేవంత్ రెడ్డికి తోడుగా తాజాగా భట్టి విక్రమార్క కూడా పాదయాత్రలతో జనానికి చేరువ అవుతున్నారు. తొమ్మిదేళ్లుగా కేసీఆర్ పాలనకు విసుగు చెందిన కన్నీళ్లు కష్టాలు పడుతున్న జనాలను ఓదార్చడానికి భట్టి విక్రమార్క బయలు దేరాడు. వేయి కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకొని వంద రోజుల మైలురాయిని చేరుకోబోతున్నాడు.
జూన్ 15న భట్టి విక్రమార్క్ బర్త్ డే సందర్భంగా రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ అభినందించారు. భట్టికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి అడిగి తెలుసుకున్నారు. గల్లీ నుంచీ దిల్లీ దాకా చర్చగా మారిన పీపుల్స్ మార్చ్… రాహుల్ ను కూడా ఆకర్షించింది. ప్రజల కోసం ఆరాటపడుతోన్న నాయకుడికి అండగా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉంటుందని ఆయన అన్నట్లు సమాచారం.
మొత్తంగా రేవంత్ రెడ్డికి తోడుగా భట్టి పాదయాత్ర ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీలో చర్చగా మారింది! రాహుల్ నుంచీ ఫోన్ రావటంతో భట్టి విక్రమార్క మరింత జోష్ తో ఇక పై ముందుకు దూసుకుపోనున్నారు.. నేతలంతా కలిసికట్టుగా అధికారం కోసం పాటుపడాలన్న రాహుల్ మాట తెలంగాణలో వర్కవుట్ అవుతోంది.