
బుధవారం అర్థరాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ లో జరిగిన గొడవపై బిగ్ బాస్ 3 విజేత, రాహుల్ సిప్లిగంజ్ పోలీసులను ఆశ్రయించాడు. తనపై దాడి చేసిన తెరాస తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువు రితేష్ రెడ్డి, అతడి గ్రూప్ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని గచ్చిబౌలి పోలీసులను కోరాడు. గురువారం తన స్నేహితులతో కలిసి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఈ మేరకు ఫిర్యాదు చేశాడు.
రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ కు వెళ్లాడు. అక్కడ ఒక అమ్మాయి విషయంలో రితేష్ రెడ్డి స్నేహితులకు, రాహుల్ కు మధ్య వాగ్వాదం జరిగింది. దింతో రాహుల్ పై రితేష్ రెడ్డి, అతడి స్నేహితులు కలిసి మూకుమ్మడిగా బీరు సీసాలతో దాడి చేశారు. పబ్ నిర్వాహకులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగకుండా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రాహుల్ ముఖానికి గాయమైంది.
పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జరిగిన ఘటనలో తన తప్పు ఏమిలేదని స్పష్టం చేశారు. తన స్నేహితురాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తనను విచక్షణారహితంగా కొట్టారని వెల్లడించారు. రాజకీయ పలుబడి ఉందన్న గర్వంతో తనపై దాడి చేశారని ఆరోపించారు. తనపై అకారణంగా దాడి చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని రాహుల్ డిమాండ్ చేశారు.