వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. తనపై అక్రమంగా కేసులు పెట్టి జైలు పాలు చేసిన జగన్ పై పగ తీర్చుకునేందుకు దారులు వెతుకుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులను సీబీఐ, ఈడీ సరిగా దర్యాప్తు చేయాలని కోరారు.
దర్యాప్తులో తేలిన అంశాలను సీబీఐ, ఈడీ వదిలిపెట్టరాదని పేర్కొన్నారు. సీఎం జగన్ ను వదిలి పెట్టకుండా కేసులు దర్యాప్తులో పక్షపాతం లేకుండా చూడాలని అన్నారు. ఇప్పటికే సీఎం జగన్ కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ సైతం జరుగుతోంది. ఈ నెల 8న జగన్, రఘురామ సీబీఐ కూడా కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంది.
ఆ తర్వాత విచారణలో ఏం జరుగుతుందో తెలియదు. బెయిల్ షరతులు ఉల్లంఘించడం లేదని సీబీఐ అఫిడవిట్ వేస్తే జగన్ కు ఊరట లభిస్తుంది. ఒక వేళ సీబీఐ కూడా సాక్షులను, నిందితులకు లబ్ధి చేకూరుస్తుందని భావిస్తే జగన్ కు ఇబ్బంది తలెత్తుతుంది. విచారణ కీలక దశలో ఉండగా హైకోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు.
గతంలో సీబీఐ జేడీగా ఉన్నలక్ష్మినారాయణ సైతం జగన్ అక్రమాస్తుల కేసుల మూలాల్లోకి వెళ్లారు. విదేశాల నుంచి నల్లధనం పెట్టుబడుల రూపంలో వచ్చిందని గుర్తించారు. రఘురామ కూడా ఈ అంశాలపైనే హైకోర్టును ఆశ్రయించారని తెలుస్తోంది. సీబీఐ, ఈడీ ఎలాంటి అంశాలను గుర్తించి వాటిని నేరాలుగా చూడకుండా విచారణ చేయకుండా పక్కన పడేసిందో రఘురామ తన వాదనల్లో వెల్లడించాల్సి ఉంటుంది. రఘురామ రాస్తున్న లేఖలే వైసీపీకి తలనొప్పులుగా మారాయంటే ఆయన హైకోర్టులో వేస్తున్న పిటిషన్లు మరింత టెన్షన్ కు గురి చేస్తున్నాయి.