
కాంగ్రెస్ జాతీయ స్థాయి పార్టీ. ఒకప్పుడు దేశాన్ని ఏలిన పార్టీ. కానీ.. ఎప్పుడైతే బీజేపీ కొద్ది కొద్దిగా బలోపేతం కావడం ప్రారంభమైందో అప్పటి నుంచి కాంగ్రెస్ తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. దీనికితోడు సరైన నాయకత్వం లేకపోవడంతో పార్టీ రోజురోజుకూ మరింత దిగజారుతోంది. ఇప్పుడు మరోసారి అధ్యక్ష ఎన్నికలు తెరమీదకు వచ్చాయి. త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఏఐసీసీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడెవరో తేల్చనున్నారు. సహజంగా తిరిగి రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి చేపడతారని అందరికీ తెలిసిందే. కానీ వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా డ్రామాలను వదిలిపెట్టడం లేదు. రాహుల్ గాంధీతోపాటు మరికొందరు అధ్యక్ష పదవికి పోటీలో ఉంటారని ప్రచారం చేస్తున్నారు.
గత ఎన్నికల్లో పార్టీ ఘోర అపజయాన్ని మూటగట్టుకుంది. ఆ సందర్భంలో రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగానే ఉన్నారు. అయితే.. ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. తన పదవికి రాజీనామా చేశారు. ఎవరు ఎంత నచ్చజెప్పినా పదవిని స్పీకరించడానికి ఇష్టపడలేదు. దీంతో తిరిగి సోనియా గాంధీనే పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించారు. సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఇప్పుడు తిరిగి కొత్త అధ్యక్షుడు ఎన్నిక కావాల్సి ఉంది. దీంతోపాటు సీనియర్ నేతలు కూడా ఇటీవల తమ లేఖలతో అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
మళ్లీ పదవీ బాధ్యతలు చేపట్టడానికి రాహుల్ వెనుకాడేందుకు కూడా పలు కారణాలు ఉన్నట్లుగా సమాచారం. సీనియర్ల పెత్తనాన్ని రాహుల్ గాంధీ ఇష్టపడటం లేదు. నిర్ణయాలను తీసుకునే విషయంలో తనకు స్వేచ్ఛ లేదని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ తల్లి సోనియాను ఇన్ ఫ్లూయెన్స్ చేస్తుండటంతో సీనియర్ నేతలను తప్పించాలని రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఆయన అనుకున్నట్లుగానే సీనియర్ నేతలు లేఖలు రాసి పార్టీ పట్ల అసంతృప్త వాదులుగా ముద్రపడిపోయారు.
తాను స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలంటే సీనియర్లు పక్కకు తప్పుకోవాల్సిందేనని రాహుల్ గాంధీ కండిషన్ పెడుతున్నారు. ఈ మేరకు సీనియర్ నేతలు కూడా అంగీకరించినట్లు తెలిసింది. పార్టీ అధికారంలోకి రావాలంటే తన వ్యూహం తనకు ఉందని రాహుల్ గాంధీ చెప్పినట్లు తెలిసింది. రాహుల్ ప్రత్యేకంగా తన కోటరీతోనే ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఎట్టకేలకు సీనియర్ నేతలు అంగీకరించడంతో రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు అంగీకరించినట్లు తెలిసింది. మొత్తానికి పదవీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధపడిన రాహుల్.. భవిష్యత్ రాజకీయాలపై దృష్టి సారించబోతున్నట్లు అర్థమవుతోంది.