Homeఆంధ్రప్రదేశ్‌రుణాల కోసం జగన్‌ ఆరాటం.. ప్రజలకు తప్పదు ఆ భారం

రుణాల కోసం జగన్‌ ఆరాటం.. ప్రజలకు తప్పదు ఆ భారం

AP CM
ఏ కుటుంబంలోనైనా ఓ పద్ధతి ప్రకారం.. ఆదాయం, ఖర్చులు కానీ లేకుంటే ఆ కుటుంబాలు ఆగం అవుతుంటాయి. అదుపు తప్పిన ఖర్చులు.. అదుపు తప్పిన అప్పులతో జీవితాలు గందరగోళంలో పడడం ఖాయం. ఇక దేశాలైతే దివాళా తీసి పరపతి పుట్టక ప్రజల పట్ల నమ్మకాన్ని కోల్పోతుంటాయి. మరి రాష్ట్రాలు అవసరాలకు మించి వ్యయం చేస్తే ఆ భారం ఎవరిపై పడుతుంది. దాని నుంచి గట్టెక్కే పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. వివిధ రాజకీయ పార్టీలు అధికారమే పరమావధిగా హామీలు గుప్పించి రుణ సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. ఈ రకమైన పరిస్థితిని నివారించేందుకే కేంద్రం అప్పులపై పరిమితిని విధిస్తూ ఎఫ్ ఆర్ బీఎం చట్టాన్ని తెచ్చింది. దాని నుంచి కూడా తెలివిగా తప్పించుకుంటూ రాష్ట్రాలు వక్రమార్గాల్లో రుణసేకరణ చేస్తున్నాయి. శృతి మించిన సంక్షేమ పథకాలే ఈ దుస్థితికి కారణం.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ఈ బాటలో పయనిస్తోందని కేంద్ర సంస్థలు అంచనా వేస్తున్నాయి. వనరులు పెరగకుండా, పెట్టుబడి వ్యయం చేయకుండా కేవలం సంక్షేమంపైనే ఫోకస్ పెట్టడంతో రానున్న కాలంలో అప్పులు చెల్లించలేక చేతులు ఎత్తేయాల్సి వస్తుందంటున్నారు ఆర్థిక నిపుణులు. ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటే భవిష్యత్తులో అప్పులు పుట్టవు.. ప్రజలకు ఆదాయమార్గాలు మూసుకుపోతాయి. ఇదంతా ఒక విషవలయంగా మారుతుంది. దేశంలోనే ఆర్థికంగా సంపన్నంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండేది. విభజన తర్వాత అవసరానికి మించి సంక్షేమ పథకాల వెల్లువ మొదలైంది. తెలంగాణకు ఆర్థికంగా వనరులు సమకూర్చి పెట్టే హైదరాబాద్ ఉండటంతో రెవెన్యూ మిగులుతో రాష్ట్రం ఏర్పాటైంది.

కానీ.. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడి వ్యయం పెరగడం లేదు. మౌలిక వసతులు అంతంతమాత్రంగా ఉన్నాయి. కొత్తగా పరిశ్రమల సంఖ్య కూడా పెద్దగా లేదు. అయినప్పటికీ సంక్షేమ పద్దు పెరిగిపోతోంది. ఏపీలో 80 శాతం కుటుంబాలకు ఏదో రూపంలో ప్రభుత్వ పథకాల లబ్ధి సమకూరుతోంది. ఏటా 80 వేల కోట్ల రూపాయల మేరకు సంక్షేమంపై వెచ్చించాల్సి వస్తోంది. తాజా గణాంకాల ప్రకారం ప్రభుత్వం చేస్తున్న మొత్తం వ్యయంలో 50 శాతం పైచిలుకు అప్పులు తెస్తూ ఖర్చు పెడుతోంది. ప్రభుత్వం చేస్తున్న అప్పులకు ప్రజలే పెట్టుబడిగా భావించాలి. అందుకే సర్కార్‌‌ తమ అవసరాలకు అనుగుణంగా ఏదో రూపంలో ప్రజలపై కొత్త పన్నులు వేసి ఖజానాను నింపుకుంటాయి. తాము చేసిన అప్పులను చెల్లిస్తాయి. రుణాలు ఇలాగే పెంచుకుంటే పోతే భవిష్యత్తులో ప్రజలపై ఏదో రూపంలో పన్నుల భారం మరింత పెరగడం ఖాయం.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు, రోజువారీ నిర్వహణకు నిధులు లేక సతమతమవుతోంది. అప్పులు తెచ్చుకోవడానికి అడ్డగోలు షరతులకు సైతం తల ఒగ్గుతోంది. విద్యుత్ సంస్కరణలు, పురపాలక సంస్థల్లో పన్నుల పెంపుదలకు దారి తీసే కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు ఏపీ అంగీకరించింది. దాదాపు 5 వేల కోట్ల రూపాయల అదనపు రుణం తెచ్చుకునేందుకు కేంద్రం విధించే షరతులకు తల ఊపాల్సి వచ్చింది. పొరుగున ఉన్న తెలంగాణ మాత్రం విద్యుత్ సంస్కరణలు, పురపాలక సంస్కరణలను తిరస్కరించింది. ప్రత్యక్షంగా ప్రజలపై పన్నుల భారం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సంస్థలపై నియంత్రణ కోల్పోతాయని తెలంగాణ కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అటువంటి ఆర్థిక స్థితి లేకపోవడంతో దయనీయంగా మారింది. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఏపీ సర్కార్‌‌ ఇలాగే నిస్సహాయంగా ఉండిపోతే భవిష్యత్‌ రాజకీయ పరిణామాలను కూడా ఎవరూ ఊహించలేం.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version