Purandeshwari Declining Importance In BJP: బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిపై అధిష్టానానికి అనుమానాలు మొదలయ్యాయా? ఆమె తన పాత వైరాన్ని మరిచి చంద్రబాబుకు దగ్గరవుతున్నారా? రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కులం, బంధుగణం వైపు మొగ్గుచూపుతున్నారా? వచ్చే ఎన్నికల నాటికి దగ్గుబాటి కుటుంబం టీడీపీ గూటికి చేరుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. నాడు చంద్రబాబుతో విభేదించిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య పురందేశ్వరితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అటు ఎమ్మెల్యేగా వెంకటేశ్వరరావు, ఎంపీగా పురందేశ్వరి ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్ లో పురందేశ్వరి కీలక మంత్రిత్వ పదవి దక్కించుకున్నారు. అటు అమాత్య పదవిలో కూడా తన ప్రతిభను చాటుకున్నారు. అయితే రాష్ట్ర విభజన పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చతికిలపడడంతో పురేందేశ్వరి అనూహ్యంగా బీజేపీ వైపు అడుగులు వేశారు. అటు భర్త వైసీపీలో ఉన్నా.. తాను మాత్రం బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశారు.

ఆ పనిచేయలేకపోవడంతో..
అయితే ఆమె సొంతంగా ఇమేజ్ పెంచుకున్నా.. ఎన్టీఆర్ కుమార్తెగానే ఎక్కువగా గుర్తింపు పొందారు. బీజేపీ నేతలు కూడా ఇదే కారణం చేత ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. సముచిత స్థానం కల్పించారు. గత ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి దూరమైన టీడీపీకి, చంద్రబాబుకు పురందేశ్వరి కొరకరాని కొయ్యగా మారతారని భావించి బీజేపీ అగ్రనేతలు కూడా ఆమెను ప్రోత్సహిస్తూ వచ్చారు. ఒడిశా, చత్తీస్ గడ్ వంటి రాష్ట్రాలకు ఇన్ చార్జి బాధ్యతలు కట్టబెట్టారు. అటు జాతీయ కార్యవర్గంలో కూడా చోటు కల్పించారు. అయితే బీజేపీలో ఆమె ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోయారన్న అపవాదును మూటగట్టుకున్నారు. అగ్రనేత అమిత్ షా ఆపరేషన్ టీడీపీ అంటూ ఒక టాస్క్ ఇచ్చారు. తెలుగుదేశం నాయకులను బీజేపీలో చేర్చాలని పురమాయించారు. ఇందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కానీ ఆమె ఆ పనిచేయలేకపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు..

ఎప్పుడూ చంద్రబాబు అంటే రగిలిపోయే దగ్గుబాటి దంపతుల స్వరంలో ఇటీవల మార్పు వచ్చింది. వారు అటు చంద్రబాబుకు, టీడీపీకి దగ్గరైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు కుటుంబపరంగా నెలకొన్న పరిణామాలు, వైసీపీ ప్రభుత్వం సొంత సామాజికవర్గం పై వ్యహరిస్తున్న తీరు కూడా వారిలో మార్పునకు కారణాలన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల చంద్రబాుతో వారికి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో వారు టీడీపీ నుంచిబరిలో దిగుతారని వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ బీజేపీ అధిష్ఠానం దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కుమార్తెగా ప్రోత్సహిస్తే అటు టీడీపీతో పాటు కమ్మ సామాజికవర్గం వారు చేరువవుతారని భావించామని.. కానీ ఇప్పుడు ఆమె చంద్రబాబుకు కోవర్టుగా మారిపోయారని బీజేపీ రాష్ట్ర నేతలు కొందరు అగ్రనేతలో చెవిలో పడేసినట్టు తెలుస్తోంది. అందుకే వారు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.
ఒక్కో పదవికి కోత..
ఇటీవల బీజేపీలో పురందేశ్వరి ప్రాధాన్యత తగ్గిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమెను ఒడిశా ఇన్ చార్జి పదవి నుంచి తప్పించారు. అటు చత్తీస్ గడ్ లో అయితే సేమ్ సీన్. అక్కడ ఇన్ చార్జి బాధ్యతలు తప్పించి కోఇన్ చార్జి పదవిలో మాత్రమే ఆమెను కొనసాగిస్తున్నారు. అటు జాతీయ కార్యవర్గంలో కూడా ఆశించిన పదవిలో లేరు. మొత్తానికైతే పురందేశ్వరిపై బీజేపీ పెద్దలకు అనుమానాలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు కోవర్టుగా మారారన్న రాష్ట్ర నేతలు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమయ్యారు. పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారు.