https://oktelugu.com/

Priyanka Gandhi Telangana: తెలంగాణ నుంచే లోక్ సభకు.. కాంగ్రెస్ లో ప్రియాంకా జోష్

ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ కొంతకాలంగా తెలంగాణపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అంతేకాకుండా పార్టీలో అంతర్గత పోరుపై కూడా ప్రియాంక దృష్టి సారించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 9, 2023 / 04:34 PM IST

    Priyanka Gandhi Telangana

    Follow us on

    Priyanka Gandhi Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఈమేరకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మొన్న రాహుల్‌గాంధీతో వరంగల్‌లో సభ నిర్వహించిన రేవంత్‌.. తాజాగా ప్రియాంకగాంధీని తెలంగాణకు తీసుకువచ్చారు. వరుస డిక్లరేషన్లతో ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్తున్నారు. దీంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ కనిపిస్తోంది. అయితే ప్రియాంక గాంధీ పర్యటన నేపథ్యంలో టీ కాంగ్రెస్‌లో సరికొత్త చర్చ మొదలైంది.

    తెలంగాణ నుంచే లోక్‌సభ బరిలో..
    ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ కొంతకాలంగా తెలంగాణపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అంతేకాకుండా పార్టీలో అంతర్గత పోరుపై కూడా ప్రియాంక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె తెలంగాణ పర్యటనతో టీ కాంగ్రెస్‌లో సరికొత్త చర్చ మొదలైంది. ప్రియాంక గాంధీ తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

    బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకే..
    తెలంగాణలో రెండు సార్లు వరుసగా అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్‌.. మరోసారి ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయాలని భారీ ప్రణాళికలతో సిద్దమవుతుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌.. ఇక్కడ అధికారం కోసం తీవ్రంగానే శ్రమిస్తుంది. ఈ క్రమంలోనే టీ కాంగ్రెస్‌ బాధ్యతలను ప్రియాంక ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్టుగా చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తదుపరి లక్ష్యం తెలంగాణ అని ఆ పార్టీ సీనియర్‌ జైరాం రమేష్‌ ఇప్పటికే ప్రకటించారు. పరిస్థితి చూస్తుంటే టీ కాంగ్రెస్‌ పూర్తి బాధ్యతలను కాంగ్రెస్‌ హైకమాండ్‌ ప్రియాంక గాంధీకే అప్పగించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ప్రియాంక పర్యటన జస్ట్‌ ఆరంభం మాత్రమేనని.. రానున్న రోజుల్లో ఆమె తెలంగాణకు ఎక్కువ సమయం కేటాయిస్తారని చెబుతున్నారు.

    తెలంగాణ నుంచి పోటీ ప్రతిపాదన..
    ఈ క్రమంలోనే టీ కాంగ్రెస్‌ ముఖ్య నేతలు తరుచుగా ప్రియాంక గాంధీతో ఢిల్లీలో సమావేశవుతున్నారు. ఆమె సూచనల మేరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే తెలంగాణలో పార్టీకి మరింత జోష్‌ తీసుకురావాలంటే.. ప్రియాంక గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయించాలనే ప్రతిపాదనను ముఖ్య నేతలు కొందరు కాంగ్రెస్‌ హైకమాండ్‌ దృష్టికి తీసుకువెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే దీని వెనక టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే.. తెలంగాణలో కూడా పార్టీకి సానుకూల పవనాలు వీచే అవకాశం ఉందని కూడా ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రియాంక తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేస్తే పార్టీకి మరింత జోష్‌ వస్తుందని కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. తెలగాణ నుంచి ప్రియాంకను బరిలో నిలిపితే.. మహబూబ్‌నగర్‌ లేదా మెదక్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేయిస్తారని తెలుస్తోంది.

    ఇందిరాగాంధీని గుర్తుచేస్తూ..
    ఈ క్రమంలోనే గతంలో ప్రియాంక గాంధీ నాన్నమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గతంలో తెలంగాణ నుంచి లోక్‌సభకు ఎన్నికైన విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ అధికారానికి దూరమయ్యారు. ఆ తర్వాత 1980లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ కాంగ్రెస్‌(ఐ) నుంచి మెదక్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ రోజుల్లోనే రెండు లక్షలకుపైగా మెజారిటీతో విజయం సాధించారు. కేంద్రంలో కూడా ఇందిర అధికారంలోకి వచ్చారు. నానమ్మ బాటలోనే ప్రియాంక కూడా తెలంగాణ బాట పడతారా అనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది.