PM Modi Independence Day Speech
PM Modi Independence Day Speech: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఎర్రకోట సాక్షిగా దేశ ప్రజలకు వరాల జల్లులు కురిపించారు. పట్టణ ప్రాంతాల్లో దిగువ, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారమే లక్ష్యంగా నూతన పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చేలా కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. రూ.లక్షల్లో ప్రయోజనం కల్పించే ఈ స్కీమ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు.
విశ్వకర్మ యోజన..
విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని సంప్రదాయ కళాకారులకు చేయూతనందించేందుకు వీలుగా విశ్వకర్మ యోజన పేరుతో కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. వచ్చే నెల నుంచే ఈ పథకం ప్రారంభించనున్నామని, ఇందుకోసం తొలి విడతగా రూ.13 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
జన ఔషధి కేంద్రాల పెంపు
చౌక ధరల్లో లభించే జనరిక్ మందులు అందరికీ అందుబాటులో ఉండేందుకు వీలుగా జన ఔషధి కేంద్రాల సంఖ్యను 10వేల నుంచి 25 వేలకు పెంచుతున్నట్లు ప్రధాని ప్రకటించారు. మార్కెట్‌లో రూ.100కు దొరికే మందులు.. జన ఔషధి కేంద్రాల్లో రూ.10 నుంచి రూ.15కే లభిస్తున్నట్లు తెలిపారు.
మీ ఆశీర్వాదం ఉంటే మళ్లీ వస్తా..
‘‘నేను మీ మధ్య నుంచే వచ్చినవాణ్ని. మీ గురించే ఆలోచిస్తా. మీరంతా నా కుటుంబం. నేను మీ కుటుంబంలో ఒకడిని. మా పనితీరు చూసి 2019లో మీరు నన్ను మళ్లీ ఎన్నుకున్నారు. దేశం అభివృద్ధి పథంలో పయనించేందుకు వచ్చే ఐదేళ్లు చాలా కీలకం. 2047లో మనం 100 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను చేసుకోబోతున్నాం. మీరు మళ్లీ ఆశీర్వదిస్తే.. వచ్చే ఏడాది ఆగస్టు 15న మళ్లీ వస్తా. ఎర్రకోట నుంచి మన దేశ విజయాలను చాటిచెప్తా’’ అంటూ 2024 ఎన్నికల్లో విజయంపై ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Prime minister narendra modi independence day speech
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com