PM Narendra Modi: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో.. ప్రధాని నరేంద్రమోదీ భావోద్వేగానికి లోనయ్యారు. శుక్రవారం(ఏప్రిల్ 19న) ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో సుడిగాలి ప్రచారం చేశారు. మధ్యప్రదేశ్‌లోని దమోహ్ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఓ యువకుడు ప్రదర్శించిన చిత్రాన్ని చూసి మోదీ భావోద్వేగానికి గురయ్యారు.
హీరాబెన్ ఫొటో..
ప్రధాని మోదీ సభలో మాట్లాడుతుండగా అక్కడకు వచ్చిన ఓ యువకుడు మోదీ తల్లి హీరాబెన్ ఫొటోను ప్రదర్శించారు. దానిని గమనించిన ప్రధాని మాటలు రాక కాసేపు ప్రసంగంగా ఆపేశారు. ఢిల్లీకి రాజైనా.. తల్లికి కొడుకునే అని మరోసారి నిరూపించుకున్నారు. అనంతరం పెన్సిల్‌లో మోదీని ఆశీర్వదిస్తున్న హీరాబెన్ చిత్రాన్ని గీసి తీసుకువచ్చిన యువకుడిని అభినందించారు. పొటో వెనుక అతడి పేరు, చిరునామా రాసి ఇవ్వాలని కోరారు. తానే స్వయంగా లేఖ రాస్తానని వేదికపైనే ప్రకటించడంతో సభికులు సైతం భావోద్వేగానికి లోనయ్యారు. మోదీకి మాతృమూర్తిపై ఉన్న ప్రేమను ప్రశంసించారు.
ఇదిలా ఉండగా హీరాబెన్ 100 ఏళ్లు పూర్తి చేసుకుని 2022, డిసెంబర్ 30న కన్నుమూశారు. ఆ సమయంలో కూడా మోదీ దుఃఖాన్ని దిగమింగుతూ వర్చువల్‌గా అధికారిక బాధ్యతలు నిర్వహించారు. తల్లి అంత్యక్రియలు నిర్వహించారు.