Iran Vs Israel: ఇరాన్‌పై ఇజ్రాయెల్ డ్రోన్లతో దాడి చేసిందని అమెరికా సైనికాధికారి ప్రకటించారు. ఈ క్రమంలో ఇరాన్‌లోని అణు కేంద్రాలకు సమీపంలో భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ అధికారికంగా గుర్తించలేదు. అయితే దాడుల వార్తల నేపథ్యంలో ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి హోస్సేన్ అమిరాబ్డోల్లాహియాన్ స్పందించారు. ఇజ్రాయోల్ దాడి నిజమే అయితే దానికి తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌ను మించిన దాడులు చేస్తామని ప్రకటించారు. శుక్రవారం(ఏప్రిల్ 19న) జరిగిన డ్రోన్ దాడులపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇస్పహాన్ సిటీలోని వైమానిక స్థావరం, అణు కేంద్రాల ప్రాంతంలోకి వచ్చినవి డ్రోన్లు కాదని, అవి పిల్లలు ఆడుకునే బొమ్మలని ఎద్దేవా చేశారు.
నిర్ధారణ కాలేదు…
ఇక డ్రోన్లతో ఇజ్రాయెల్‌కు సంబంధం ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని తెలిపారు. డ్రోన్ దాడులకు సంబంధించిన మీడియాలో వచ్చిన కథనాలపై స్పష్టత లేదు. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేసినట్లు నిర్ధారణ అయితే మాత్రం తాము అంతకుముంచి దాడులు చేస్తామని స్పష్టం చేశారు. అలా కాకపోతే ఇక్కడితో ముగిస్తామని తెలిపారు. తమ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఎలాంటి సాహసం చేయలేదని, అందుకే తాము ప్రతిచర్యకు దిగడం లేదని వెల్లడించారు.
డ్రోన్ల కూల్చివేత..
ఇక శుక్రవారం అమెరికా తయారీ ఎఫ్–14 టామ్‌క్యాట్స్ యుద్ధ విమానాలు ఉన్న ఇరాన్‌లోని ఇస్ఫహాన్ సిటీ వైమానిక స్తావరం, అణు కేంద్రాలకు సమీపంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అయితే ఇస్ఫహాన్ నగర గగనతలంలో చక్కర్లు కొడుతున్న డ్రోన్లను కూల్చేశామని, దాడిని విజయవంతంగా అడ్డుకున్నామని ఇరాన్ ప్రకటించింది. ఈ దాడి తామే చేశామని ఇజ్రాయెల్ ప్రకటించలేదు. అమెరికా మాత్రం దాడి ఇజ్రాయెల్ పనే అని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇరాన్ మద్దతు స్థావరాలపై దాడులు..
ఇదిలా ఉండగా ఇరాన్ మద్దతున్న స్థావరాలపై శనివారం(ఏప్రిల్ 20న) తెల్లవారుజామున దాడులు జరిగాయి. మొత్తం ఐదు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో కనీసం ముగ్గురికి గాయాలు అయ్యాయని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ పేలుళ్లకు కారణం ఎవరనేది స్పష్టత లేదు. తాజాగా ఈ ఘటన పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి.