అతడో నయవంచకుడు. యువతులను ఆకర్షణతో పడగొట్టి వారిని కొల్లగొడతాడు. ఫేస్ బుక్, షేర్ చాట్, ఇన్ స్రాగ్రామ్ తో యువతులు, మహిళలను ఎరగా వేసుకుని అందినకాడికి దోచుకుంటాడు. తరువాత వారి అర్థనగ్న చిత్రాలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని బయటపెడతానని బెదిరిస్తాడు. అతడి వలలో పడి ఎందరో యువతులు మోసపోయారు. దీంతో అతడి ఆగడాలకు అడ్డు లేకుండా పోయాయి. నిరంతరం మోసాలే పెట్టుబడిగా చేసుకుని రెచ్చిపోతున్నాడు. ఈ క్రమంలో ఈ మోసగాడిని కడప తాలూకా పోలీసులు అరెస్టు చేశారు.
అతడి నుంచి రూ.1.26 లక్షల నగదు, 30 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇతడిపై రెండు తెలుగు స్టేట్లలో కేసులు నమోదయ్యాయి. కడప జిల్లా డీఎస్పీ సునీల్ పలు వివరాలు వెల్లడించారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్ అలియాస్ ప్రశాంత్ రెడ్డి అలియాస్ రాజారెడ్డి అలియాస్ టోనీ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలోనే వదిలేసి జల్సాలకు అలవాటు పడ్డాడు. 2017 నుంచి గొలుసు చోరీలకు పాల్పడ్డాడు. దీంతో జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చాడు.
అనంతరం శ్రీనివాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ప్రశాంత్ రెడ్డి శ్రీనివాస్ కు సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి బంగారు గొలుసు కాజేశాడు. జులై 29న ఓ చోరీ కేసులో ప్రసన్నకుమార్ ను అరెస్టు చేసి విచారించారు. దీంతో విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. రెండు స్టేట్లలోని పలు ప్రాంతాల్లో తనదైన శైలిలో దొంగతనాలు చేస్తూ ఉండే క్రమంలో పోలీసులకు చిక్కాడు.
కడప, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఫేస్ బుక్, షేర్ చాట్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా యువతులు, మహిళలతో పరిచయం పెంచుకుంటాడు. వారికి మాయమాటలు చెప్పి ప్రేమలో దింపుతాడు. వారితో చాటింగ్ చేస్తూ వారి అర్థ నగ్న ఫొటోలు, వీడియోలు సేవ్ చేసుకుని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు పంపాలని డిమాండ్ చేస్తాడు. లేదంటే నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించి 200 మంది యువతులు, 100 మంది వరకు మహిళలను మోసం చేసినట్లు పేర్కొన్నారు.