దేశంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. మూడో కూటమి ప్రయత్నాలు ముమ్మరం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్య జరిగిన సమావేశమే నిదర్శనం. ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలోనే జరిగింది. దీంతో థర్డ్ ఫ్రంట్ కార్యాచరణ ప్రారంభమైందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ఎన్సీపీ అధినేత శరత్ పవార్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. బీజేపీయేతర ప్రభుత్వం కోసం అప్పుడే వ్యూహాలు రచించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
పంజాబ్ లో 2017లో జరిగిన ఎన్నికల సందర్భంగా బీజేపీ నుంచి బయటకు వచ్చిన పంజాబ్ కాంగ్రెస్ నవజోతి సింగ్ సిద్దు ఈసారి అమ్ ఆద్మీ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఈసారి సిద్దునే పంజాబ్ కు కాబోయే ముఖ్యమంత్రి అని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 2017 ఎన్నికల్లో 117 స్థానాల్లో 77 కాంగ్రెస్ గెలిచింది. కెప్టెన్ అమరీందర్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు సిద్దునే డిప్యూటీ సీఎంగా చేయాలనే చర్చ సాగింది. కానీ అలా జరగలేదు. దీంతో సీఎంకు సిద్దుకు మధ్య అగాధం పెరిగింది. ఈసారి మాత్రం అలా కాకుండా ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రశాంత్ కిషోర్ రాకతో కాంగ్రెస్ లో నూతనోత్తేజం వస్తున్నట్లు కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దాని కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దేశంలో కేవలం నాలుగు స్టేట్లలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో దేశవ్యాప్తంగా పార్టీని గట్టెక్కించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే దీని కోసం పక్కా ప్రణాళికలు రచించేందుకు సిద్ధమవుతున్నారు.
2024 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదువుతున్నారు. బీజేపీకి ఎదురు నిలిచేందుకు నేతలను సమాయత్తం చేస్తున్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధం కావాలని సూచిస్తున్నారు. దేశంలో ఉన్న బీజేపీ వ్యతిరేకతను సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు మార్గాలను వెదుకుతున్నట్లు సమాచారం.