పోయిన సార్వత్రిక ఎన్నికల వేళ వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు ప్రశాంత్ కిశోర్. జగన్ గెలిచాక ఇక ఆయన పని పూర్తయిపోయింది. రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అదేంటో నిన్న అకస్మాత్తుగా మరోసారి జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఊరికే కలవరు మహానుభావులు అన్నట్లు వీరి కలయిక సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా జగన్‌తో పీకే భేటీ కావడం ప్రతిపక్షాలకు ఒకింత వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
Also Read: జగన్ వచ్చాక హిందూ ఆలయాలపై దాడులు ఎందుకు?
గత సార్వత్రిక ఎన్నికలకు వైసీపీ వ్యూహకర్తగా పీకేను పెట్టుకున్నారు వైఎస్ జగన్. తట్టుకోలేని టీడీపీ జగన్‌పైనే కాకుండా పీకే పైనా విమర్శల దాడికి దిగింది. అసలు వైసీపీ రాజకీయ పార్టీనే కాదని, అదో లిమిటెడ్ కంపెనీ కావడం వల్లే కన్సల్టెన్సీని నియమించుకుందని అవహేళన చేశారు. దీంతో పీకే తన వ్యూహాలకు మరింత పదును పెట్టి టీడీపీ అధికార పీఠాన్ని కూకటి వేళ్లతో సహా పీకి పారేయడానికి డిసైడ్ అయ్యారు. బంపర్ మెజార్టీతో వైసీపీ గెలుపొందడంతో ఆ తర్వాత టీడీపీ నేతలు యూటర్న్ తీసుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయానికి పీకే రచించిన సోషల్ ఇంజనీరింగే కారణమని అంతర్గత సమీక్షలో అభిప్రాయపడ్డారు.
ఇక తర్వాత పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతుండడంతో రాబోయే ఎన్నికలను టార్గెట్ చేసింది టీడీపీ. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అదే టీడీపీ జగన్ బాటను ఎంచుకుంది. ఇదే ప్రశాంత్ కిశోర్ టీమ్‌లో కీలకంగా వ్యవహరించిన రాబిన్‌శర్మను తమ పార్టీ వ్యూహకర్తగా నియమించుకుంది. పీకేది ఐ ప్యాక్ సంస్థ కాగా, రాబిన్ కొత్తగా షో టైమ్ కన్సల్టెన్సీ పేరుతో తెరపైకి వచ్చారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో రాబిన్‌శర్మ ఇప్పటికే రంగంలో దిగారు.
Also Read: టీడీపీ నోరు మూయించే జగన్ ప్లాన్
ఇదిలా ఉండగా స్థానిక సంస్థలు, తిరుపతి ఉప ఎన్నికతోపాటు ప్రధానంగా మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రత్యర్థులు రాజకీయ లబ్ధిపొందాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ప్రశాంత్ కిశోర్‌తో భేటీ అయి ఏం చర్చించారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీడీపీకి బలమైన ఓటు బ్యాంకును సైతం బద్దలు కొట్టి వైసీపీ వైపు మరల్చడం వెనక పీకే మాస్టర్ మైండ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు మరోసారి అలాంటిదేదో వ్యూహం రచించేందుకే జగన్‌తో పీకే భేటీ అయ్యారనే చర్చ సాగుతోంది. సహజంగా జగన్ మాటలు తక్కువ, పని ఎక్కువన్నట్టు కనిపిస్తూ ఉంటారు. అందుకే రాజకీయ ఎత్తుగడలు సైతం అలానే ఉంటాయి. అందుకే.. అంత సీనియర్ లీడర్ చంద్రబాబును సైతం మట్టికరిపించారు. ఇక.. పీకేతో జగన్ భేటీ వైసీపీ కార్యకర్తల్లో మాత్రం కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. వాళ్లిద్దరు చర్చించారంటే.. ప్రతిపక్షాలకు మూడిందనే అభిప్రాయాలు వైసీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్