Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగంగా ఇస్రో మరో కీలక ఘనతను సాధించింది. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపిన దాదాపు నాలుగు గంటల అనంతరం దాని లోపలి నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చింది. దీనిపై ఇస్రో స్పందిస్తూ.. ‘చంద్రుడిపై భారత్ నడిచిందంటూ’ తన అధికారిక ఎక్స్ ఖాతాలో గురువారం పోస్టు చేసింది. ‘‘చంద్రయాన్-3 రోవర్ చంద్రుడి కోసమే భారత్‌లో తయారైంది. అది ల్యాండర్ నుంచి కిందకు దూసుకెళ్లడంతో భారత్ చంద్రుడిపై నడక సాగించింది’’ అంటూ ట్వీట్ చేసింది. ల్యాండర్ మాడ్యూల్‌లోని పెలోడ్‌లు ఇల్సా, రాంభా, ఛాస్డే ఆన్ అయ్యాయని వివరించింది. ప్రజ్ఞాన్ రోవర్ కార్యకలాపాలు ప్రారంభమైనట్లు తెలిపింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందన
ప్రజ్ఞాన్ రోవర్ విజయవంతంగా బయటకు రావడంపై శాస్త్రవేత్తల బృందాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. ‘‘విక్రమ్ ల్యాండ్ అయిన కొన్ని గంటల్లోనే దాని లోపలినుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు రావడం చంద్రయాన్-3 ప్రయోగంలో దక్కిన మరో విజయం. చంద్రుడి గురించి మన అవగాహనను సుసంపన్నం చేసే సమాచారం, విశ్లేషణల కోసం దేశ పౌరులు, శాస్త్రవేత్తలతో పాటు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను’’ అని ఎక్స్ వేదికగా రాష్ట్రపతి పేర్కొన్నారు. కాగా, 26 కిలోల బరువున్న ఆరు చక్రాల రోవర్ విక్రమ్ ల్యాండర్ సైడ్ ప్యానెళ్లలో ఒకదాన్ని ర్యాంప్‌గా ఉపయోగించుకొని దాని లోపలి నుంచి చంద్రుడి ఉపరితలంపై దిగుతుందని ఇస్రో ఇంతకుముందే ప్రకటించింది. దాదాపు 1,752 కిలోల బరువున్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై 14రోజుల పాటు పనిచేసి అక్కడి పరిసరాలను అధ్యయనం చేసే లా రూపొందించారు. వీటిలోని పెలోడ్‌ల సాయంతో చంద్రుడిపై ఉండే వివిధ రసాయనాలు, ఖనిజాలను గుర్తించి పరిశోధనలు సాగిస్తాయి.
రోవర్ తన పని బాగా చేస్తోంది: ఇస్రో చైర్మన్
చంద్రుడి ఉపరితలంపై నిర్దేశించిన ప్రదేశంలోనే చంద్రయాన్-3 ‘విక్రమ్’ ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ అయిందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. ‘‘అనుకున్న ప్రదేశంలోనే ల్యాండర్ ల్యాండ్ అయింది. ల్యాండింగ్ లొకేషన్, కేంద్రాన్ని గుర్తించాం. గురువారం తెల్లవారు జామున ల్యాండర్ నుంచి (ప్రజ్ఞాన్) రోవర్ వేరు పడింది. రోవర్ తన అన్వేషణను మొదలుపెట్టింది. అది బాగా పని చేస్తోంది. చంద్రుడిపై ఉన్న ఖనిజాలు, వాతావరణం, భూకంప కార్యకలాపాలపై ప్రాథమికంగా అధ్యయనం చేస్తుంది’’ అని పేర్కొన్నారు.
ఇది మరో కీలక మైలురాయి: కస్తూరిరంగన్
చంద్రయాన్-3 విజయవంతం కావడంతో భవిష్యత్తు గ్రహయాత్రలకు చంద్రుడిని టేకాఫ్ పాయింట్‌గా ఉపయోగించే సామర్థ్యాన్ని సాధించామని ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ అన్నారు. ‘‘గత 50 ఏళ్ల ఇస్రో ప్రయాణంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నాం. ఇది చాలా ప్రత్యేకం.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అన్వేషించడం చాలా ముఖ్యం. అక్కడ నీరుండే అవకాశముంది. అంతరిక్ష సాంకేతికతలో భారత్ అగ్రగామిగా నిలుస్తోంది. పరిశోధనలకు అవసరమైన సాంకేతికత కోసం ఏ దేశంపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ విజయంతో పరిస్థితి మారింది’’ అని వ్యాఖ్యానించారు.
చంద్రయాన్-3లో ప్రైవేటు భాగస్వామ్యం
చంద్రయాన్-3 విజయవంతంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు ప్రముఖ ప్రైవేటు సంస్థలు తోడ్పడ్డాయి. టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (టీసీఈ) ప్రధానంగా స్వదేశీ పరిజ్ఞానంతో క్రిటికల్ సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్‌ను రూపొందించింది. అలాగే సాలిడ్ ప్రొపెల్లంట్ ప్లాంట్, వెహికిల్ అసెంబ్లీ బిల్డింగ్, మొబైల్ లాంచ్ పెడస్టల్‌ను నిర్మించింది. లార్సన్ అండ్ టొబ్రో (ఎల్ అండ్ టీ) కూడా చంద్రయాన్-3కి పలు పరికరాలు సరఫరా చేసింది. ఇంకా గోద్రెజ్-బోయ్స్ సంస్థ, ఓమ్నీప్రజెంట్ రోబోటిక్ టెక్నాలజీస్ తదితర సంస్థలు కూడా వివిధ పరికాలను అందించాయి. చంద్రయాన్-3లో కేరళకు చెందిన 26 కంపెనీల ఉత్పాదనలను ఉపయోగించారని.. వీటిలో ఆరు రాష్ట్రప్రభుత్వరంగ సంస్థలు కాగా.. 20 ప్రైవేటు కంపెనీలు ఉన్నాయని ఆ రాష్ట్ర పరిశ్రమల మంత్రి రాజీవ్ వెల్లడించారు.
నేడు దక్షిణాఫ్రికా నుంచి నేరుగా
బెంగళూరుకు ప్రధాని మోదీ
చంద్రయాన్-3ను విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను అభినందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు రానున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధాని శనివారం ఉదయం 5.55 గంటలకు హెచ్‌ఏఎల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కిలోమీటరు మేర రోడ్‌షోలో పాల్గొంటారు. ఉదయం 7 గంటలకు పీణ్యాలోని ఇస్రో కేంద్రానికి చేరుకుంటారు. చంద్రయాన్ మిషన్‌లో భాగస్వాములైన శాస్త్రవేత్తలందరినీ స్వయంగా కలిసి అభినందించనున్నారు. శాస్త్రవేత్తల అనుభవాలను తెలుసుకోనున్నారు. కాగా, ఇస్రో శాస్త్రవేత్తలకు ‘చంద్రయాన్’ విజయం చెందాల్సిన క్షణాల్లో అందరి దృష్టిని ప్రధాని మోదీ తనవైపు మళ్లించుకున్నారని కాంగ్రెస్ విమర్శించింది. అయితే.. శాస్త్రవేత్తలకు, ఇస్రోకు మద్దతు అందించడంలో ఎందుకు అంత ఘోరంగా వైఫల్యం చెందారనేది ఆయన సమాధానం చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేసీ వేణగోపాల్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా, ‘చంద్రయాన్-3’ కోసం పనిచేసిన హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ (హెచ్‌ఈసీ) ఇంజనీర్లకు 17 నెలలుగా వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఇస్రో సాధించిన విజయాన్ని ప్రస్తుతిస్తూ ఆ సంస్థ చైర్మన్ సోమనాథ్‌కు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ లేఖ రాశారు. ఇవి ప్రతి భారతీయుడూ గర్వపడే మహత్తర ఉద్వేగ క్షణాలనీ, ముఖ్యంగా యువతను ఈ విజయం ఉత్తేజపరిచిందని ఆ లేఖలో తెలిపారు.