Power Star : ప్రముఖ సినీ హీరోలకు ఓ ట్యాగ్ లైన్ ఉంటుంది. దాదాపుగా తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోలందరికీ బిరుదులు ఉన్నాయి. కానీ.. కొందరికి ఉన్న ట్యాగ్ లైన్ వారికి సరిగ్గా సరిపోతుంది. వారి అసలు పేరును మించి పాపులర్ అవుతుంది. అభిమానులు ఆ పేరు ను పలవరించకుండా ఉండలేరు. అలాంటి వాటిలో ఒకటి పవర్ స్టార్. అభిమానులు పవన్ నామ స్మరణకన్నా.. పవర్ స్టార్ (Power Star) పేరును పలకరించేదే ఎక్కువ. సినిమా పోస్టర్లోగానీ.. థియేటర్లోగానీ.. పవర్ స్టార్ అనే పేరు కనిపిస్తే ఆ కిక్కే వేరు అంటారు ఫ్యాన్స్. అలాంటి పేరు ఇక కనిపించదు! కాల క్రమంలో వినిపించకపోవచ్చు కూడా!! మరి, ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఎవరు తెచ్చారు? అన్నది చూద్దాం.
చాలా మంది హీరోలకు ట్యాగ్ లైన్ అనేది ఏదో ఒకటి ఉండాలి కాబట్టి.. అన్నట్టుగా ఉంటాయి. కానీ.. పవర్ స్టార్ కు మాత్రం ఆ బిరుదు అలా వచ్చింది కాదు. ఆయన స్టామినా నుంచి పుట్టింది. పవన్ తొలి చిత్రం అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి చిత్రంలో చేతుల మీదుగా 24 కార్లు పోనిచ్చుకుంటాడు. అంతేకాదు.. తన గుండెలపై పెద్ద పెద్ద బండలు పెట్టించుకొని, సమ్మెటతో పగలగొట్టించుకుంటాడు. అప్పటి వరకూ తెలుగు సినీ చరిత్రలోనే ఏ హీరో కూడా ఇలాంటి సాహసాలు చేయలేదు. కఠినమైన సన్నివేశాల్లో డూప్ లతో పనికానిచ్చే హీరోలున్న ఇండస్ట్రీలో.. పవన్ నేరుగా ఇలాంటి డేంజర్ స్టంట్స్ చేయడం సంచలనం సృష్టించింది. ఆ విధంగా.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముందు పవర్ స్టార్ అనే బిరుదు సగర్వంగా వచ్చి చేరింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకూ తెలుగు సినీ ఇండస్ట్రీలో.. అభిమానుల గుండెల్లో పవర్ ఫుల్ గా ప్రతిధ్వనిస్తూనే ఉంది ఆ పేరు. అలాంటి బిరుదు ఇక కనిపించకుండా పోతోంది. దీనికి కారణం ఎవరో కాదు.. సాక్షాత్తూ పవన్ కల్యాణే! ‘‘రాబోయే సినిమాల్లో నా పేరు ముందు పవర్ స్టార్ అనే బిరుదు తగిలించొద్దు’’ అని దర్శక నిర్మాతలకు కరాఖండిగా చెప్పాడట పవన్. దీంతో.. అనివార్యంగా పవర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ లేకుండానే నేమ్ కార్డ్ పడనుంది. ఇటీవల భీమ్లా నాయక్ గ్లింప్స్ లోనూ, ఫస్ట్ సాంగ్ లోనూ పవన్ కల్యాణ్ అని మాత్రమే వేశారు.
పవన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ లో ‘‘గాడ్ ఆఫ్ మాసెస్’’ అని పెట్టారు. దీనిపైనా పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారట! పవర్ స్టార్ బిరుదే వద్దని చెబితే.. కొత్తగా ఇంకేదో పెట్టడమేంటని సీరియస్ అయ్యాడట. ఎలాంటి బిరుదులూ తన పేరు ముందు ఉండొద్దని తేల్చి చెప్పేశాడట. దీనికి కారణం ఏమంటే.. తాను ప్రజా జీవితంలోకి వచ్చేశానని పవన్ చెప్పారట. నిజానికి సినిమాలను వదిలేశానని, కేవలం పార్టీని నడపడానికి అవసరమైన డబ్బుల కోసమే సినిమాలు చేస్తున్నానని తేల్చి చెప్పారట. కాబట్టి.. తాను సినిమా హీరోగా ప్రజల మనసుల్లో ఉండాలని కోరుకోవట్లేదని, ప్రజానాయకుడిగానే గుర్తింపు పొందాలని భావిస్తున్నారట.
అందువల్ల.. ఇకపై రాబోయే సినిమాల్లో పవన్ కల్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ అని కనిపించబోదు. కేవలం పవన్ కల్యాణ్ అనే టైటిల్ కార్డు మాత్రమే వేస్తారు. పాతిక సంవత్సరాలుగా తెలుగు సినీ అభిమానులను ఉర్రూతలూగించిన ‘పవర్ స్టార్’.. ఇక, కనుమరుగైపోనున్నాడు. చరిత్రలో కలిసిపోనున్నాడు. ఇది ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశ కలిగించే అంశమే అనడంలో సందేహం లేదు. కానీ.. పవన్ ఆశయాన్ని గుర్తించి, అభిమానులు వాస్తవాన్ని అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైందనే చెప్పాలి.