Ponguleti Srinivasa Reddy: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో దాదాపుగా చేరిపోయినట్టే. జూపల్లి కృష్ణారావు, దామోదర్ రావు కూడా త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. అన్నీ కుదిరితే జూలై 2న ఖమ్మంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటే జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి కొద్ది రోజుల నుంచి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నారు. వీరిద్దరూ భారత రాష్ట్ర సమితి నాయకత్వం తీరును భరించలేక బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత అధిష్టానానికి వ్యతిరేకమైన స్వరం వినిపించారు. ఒకానొక దశలో వీరిద్దరూ బిజెపిలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. భారత రాష్ట్ర సమితి పై చేస్తున్న పోరాటానికి సంబంధించి అధిష్టానం ఒక అడుగు వెనకేయడంతో వీరు తమ భవిష్యత్తు గురించి ఆలోచించి.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు కూడా ఆ ఇద్దరి నేతల ఆలోచనలు పూర్తిగా మార్చేశాయి.
ఎంతవరకు ప్రభావం ఉంటుంది
2014లో వైఎస్ఆర్సిపి ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఖమ్మం పార్లమెంటు స్థానానికి జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి నామా నాగేశ్వరరావు మీద విజయం సాధించారు. తనతో పాటు నలుగురు ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన భారత రాష్ట్ర సమితిలో చేరారు. అప్పటి నుంచి 2019 వరకు ఆయన ఖమ్మం పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. ఇదే సమయంలో భారత రాష్ట్ర సమితి అప్పగించిన ప్రతి పని కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో అధికార భారత రాష్ట్ర సమితి బలపరిచిన కార్మిక సంఘం విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే అనూహ్యంగా 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం సీటు పొంగులేటికి కాకుండా భారత రాష్ట్ర సమితి నామా నాగేశ్వరరావుకు ఇచ్చింది. ఈ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థి గెలుపు కృషి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశిస్తే.. ఆ పనిని పొంగులేటి నూటికి నూరుపాళ్ళు చేశారు. అయితే ఇదే సమయంలో పొంగులేటికి ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇక ఇదే సమయంలో రవాణా శాఖ మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అనుచరులు పొంగులేటి వర్గీయుల మీద పెత్తనం చెలాయించడం ప్రారంభించారు. ఈ విషయంపై ఎన్నోసార్లు అధిష్టానానికి పొంగులేటి ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో పొంగులేటిలో ఒకింత నైరాశ్యం అలముకుంది. ఇక అప్పటినుంచి ఆయన అధిష్టానం పై ఒకింత ఆగ్రహం గానే ఉన్నారు. తన కూతురు పెళ్లికి ఆహ్వానించినప్పటికీ కెసిఆర్ రాకపోవడం.. మంత్రి ఆగడాలు పెరిగిపోవడంతో పొంగులేటి పార్టీతో తన సంబంధాలను దాదాపు కట్ చేసుకున్నారు. ఇక ఈ లోగానే 2023 నూతన సంవత్సర సందర్భంగా పార్టీ అధిష్టానానికి ఆయన వ్యతిరేక స్వరం వినిపించారు. అప్పటినుంచి ఇప్పటిదాకా కెసిఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆయన విమర్శలు చేస్తున్నారు. దీంతో పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది.
గత ఆరు నెలల నుంచి అనేక చర్చలు జరిపిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పొంగులేటి.. తన వర్గాన్ని కూడా అందులో కలుపుతున్నారు. భద్రాద్రి జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, డిసి సి బి మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, మార్క్ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, తెల్లం వెంకటరావు, జారే ఆదినారాయణ, మద్దినేని స్వర్ణకుమారి, కోట రాంబాబు, ఊకంటి గోపాలరావు, రాజా రమేష్, జూపల్లి రమేష్ వంటి వారు భారత రాష్ట్ర సమితిలో చేరబోతున్నారు. వీరంతా కూడా ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించేంత సత్తా ఉన్నవారే. వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీ ఇక్కడ జిల్లాలో చాలా బలం సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎన్నికలవేళ భారత రాష్ట్ర సమితికి ఒకింత దెబ్బే. పైగా వీరంతా కూడా ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేసేంత సత్తా ఉన్నవాళ్లు. ఎన్నికలవేళ వీరు పార్టీ మారడం తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
రెడ్డి సామాజిక వర్గం కూడా
ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరబోతున్న నేపథ్యంలో ఆయన సొంత సామాజిక వర్గం కూడా కాంగ్రెస్ పార్టీకి జై కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సామాజిక వర్గం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా బలంగా ఉంది. అంతటి తెలంగాణ సెంటిమెంట్ కాలంలోనూ 2014లో జరిగిన ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆయన సొంత సామాజిక వర్గం గెలిపించుకుంది. 2018 లో జరిగిన ఎన్నికల్లోనూ పొంగులేటి వెంటే నడిచింది. భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను గెలిపించింది. పొంగులేటి కి 2019లో టికెట్ ఇవ్వకపోవడంతో ఈ సామాజిక వర్గం అప్పటినుంచి భారత రాష్ట్ర సమితి పై ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో వారంతా కూడా ఆయన బాట అనుసరిస్తున్నారు. ఈ ప్రభావం రాబోయే ఎన్నికల్లో తీవ్రంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి పొంగులేటికి అన్యాయం చేసిందన్న భావన ప్రజల్లో ఉండటం కూడా కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రమే కాకుండా పొరుగున ఉన్న కోదాడ, మహబూబాబాద్ నియోజకవర్గంలోనూ పొంగులేటి ప్రభావం ఉంటుందని తెలుస్తోంది.
ఖమ్మం, సత్తుపల్లి, పాలేరు, భద్రాచలం, మధిర, వైరా, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల సమూహంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా విస్తరించి ఉంది. 2018 ఎన్నికల్లో ఒక ఖమ్మం తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మినహా మిగతా వారంతా భారత రాష్ట్ర సమితిలో చేరారు. అయితే ప్రస్తుతం వీరంతా కూడా ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలోనే పొంగులేటి కాంగ్రెస్ లో చేరుతున్న నేపథ్యంలో పరిస్థితి మరింత ప్రతిబంధకంగా మారుతుందని అంచనాలు ఉన్నాయి. భారత రాష్ట్ర సమితి అధిష్టానం కూడా ఖమ్మం జిల్లా పై ఎటువంటి ఆశలు పెట్టుకోవడం లేదని తెలుస్తోంది. అన్నింటికీ మించి కాంగ్రెస్ పార్టీలో బలమైన వర్గాలుగా ఉన్న భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి ఐక్యత రాగం ఆలపిస్తుండడం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీరికి తోడు కావడంతో కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 2018 ఫలితాలు ఇప్పుడు కూడా పునరావృతమవుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గెలుపొందారని, కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన అభ్యర్థిగా బరిలో ఉంటే ఆ ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ponguleti srinivasa reddy will join congress party what will the political equations change
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com