విశాఖ ఉక్కు ఉద్యమం.. తిలాపాపం.. తలా పిడికెడు..

విశాఖ ఉక్కు ఉద్యమం సందర్భంగా ఏపీలోని రాజకీయ పార్టీలు కొత్తనాటకానికి తెర తీస్తున్నాయి. వారి తాజా పొలిటికల్ డ్రామాకు సందర్భాన్ని వేదికగా మార్చుకున్నాయి. రాజకీయ నాయకులు తమ ప్రసంగాలతో ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూస్తున్నారు. అయిపోయిన పెళ్లిక భజంత్రీలు వాయిస్తున్నారు. ఏదో జరగబోతోందని నమ్మకం కలిగేలా చేస్తున్నారు. సమైక్య ఆంధ్ర ఉద్యమం పేరిట గతంలో చేసిన హడావుడిని మళ్లీ రిపీట్ చేస్తున్నారు. హడావుడిగా పార్టీ పెట్టి.. ఎన్నికల సమయంలో హల్చల్ చేస్తున్న పవన్ కల్యాణ్ మరోసారి […]

Written By: Srinivas, Updated On : February 12, 2021 11:45 am
Follow us on


విశాఖ ఉక్కు ఉద్యమం సందర్భంగా ఏపీలోని రాజకీయ పార్టీలు కొత్తనాటకానికి తెర తీస్తున్నాయి. వారి తాజా పొలిటికల్ డ్రామాకు సందర్భాన్ని వేదికగా మార్చుకున్నాయి. రాజకీయ నాయకులు తమ ప్రసంగాలతో ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూస్తున్నారు. అయిపోయిన పెళ్లిక భజంత్రీలు వాయిస్తున్నారు. ఏదో జరగబోతోందని నమ్మకం కలిగేలా చేస్తున్నారు. సమైక్య ఆంధ్ర ఉద్యమం పేరిట గతంలో చేసిన హడావుడిని మళ్లీ రిపీట్ చేస్తున్నారు.

హడావుడిగా పార్టీ పెట్టి.. ఎన్నికల సమయంలో హల్చల్ చేస్తున్న పవన్ కల్యాణ్ మరోసారి అడ్డంగా దొరికిపోయారు. మిగిలిన పార్టీలు చక్కగా తప్పించుకునేందుకు ఉపాయం వేస్తుండగా.. పవన్ కల్యాణ్ మాత్రం.. విశాఖ ఉక్కును కాపాడేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తానంటూ.. ఢిల్లీ వెళ్లి భంగపాటుకు గురయ్యారు. ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో మిగిలింది ఏమీ లేదని.. ఉపసంహరణ సాధ్యం కాదని కేంద్ర తెగేసి చెప్పేసింది. నిజానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరహాలో ఓ లేఖ రాసి వదిలేసినా.. బాగుండేదని జన సైనికులు అనుకుంటున్నారు.

Also Read: అమరావతి ప్రాజెక్టుల్లో కదలిక.. కీలకంగా శ్రీలక్ష్మీ

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాల్సిన బాధ్యత ఏపీలోని అధికార పార్టీ వైసీపీపై కూడా ఉంది. లోక్ సభలో 22 మంది వైసీపీ ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో ఆరుగురు ఎంపీలు ఉన్నారు. ముఖేశ్ అంబానీ కోటాలోని సభ్యత్వాన్ని పక్కన పెట్టినా.. 27మంది సభ్యులు పార్లమెంటును స్తంభింపజేస్తే.. వచ్చే ప్రకంపనలు వేరు . కానీ అధికార పార్టీ దీనిని సీరియస్ గా తీసుకోవడం లేదు. కేంద్రంపై విరుచుకు పడేందుకు సాహసించడం లేదు. ఇతర పార్టీలు ఎలాగూ తామున్నామన్న సంగతే తప్పా.. తెగింపుకు దిగిన రోజులు లేవు.

Also Read: నిమ్మగడ్డతో జగన్ సర్కార్ రాజీ?

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ సాగిన నాటి ఉద్యమ స్ఫూర్తి నేడు కనిపించడం లేదు. రాజకీయ పార్టీలు అన్నీ ప్రస్తుతం సంఘీభావం ప్రకటిస్తున్నాయి… కానీ.. కార్యాచరణకు సిద్ధం కావడం లేదు. రాజకీయంగా ప్రాముఖ్యత కోల్పోయి తనకు ఒక అజెండా, జెండా కావాలని కోరుకుంటున్నారు గంటా శ్రీనివాసరావు. భలే చాన్సులే అనుకుంటూ.. రాజీనామాకు దీనిని సాకుగా వాడుకుంటున్నారు. తెలుగుదేశం కూడా ఉద్యమం విషయంలో నీళ్లు నములుతోంది. ఇప్పటికే ఏదోరకంగా కేంద్రానికి చేరువ కావాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. అనవసర వివాదాన్ని తలకెత్తుకునేందుకు సిద్ధంగా లేమని పరోక్షంగా చెప్పేస్తున్నారు. అందుకే విశాఖ ఉక్కు ఉద్యమంపై టీడీపీ కార్యాచరణ ఏవిధంగా ఉండబోతుందో.. చెప్పలేక పోతున్నారు. వామపక్షాలు క్షీణించి బలంగా ఉన్నాయి. ఉద్యమాన్ని నిర్మించగల అన్న బలం వారికి సమకూరడం లేదు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

అయితే సీఎం జగన్ విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ విషయంలో కేంద్రానికి గతంలో సానుకూల వ్యక్తం చేశారన్నది తాజా సమాచారం. ఒక్కసారిగా విక్రయం కాకుండా షేర్ల రూపంలో ప్రయివేటు వ్యక్తులు కొనుగోలు చేస్తే.. భాగుంటుందని చెప్పినట్లు తెలిసింది. అదికూడా మరో రూపంలో ప్రయివేటీకరణే. అంతే కాకుండా పోస్కోతో 2019లోనే ఒప్పందం కుదిరింది. తరువాత ముఖ్యమంత్రిని పోస్కో ప్రతినిధులు సైతం కలిసినట్లు కేంద్రం మంత్రి పార్లమెంటులోనే కుండ బద్దలు కొట్టారు. దీన్ని బట్టి చూస్తూ… రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో, ముఖ్యమంత్రికి అంతా ముందే తెలుసు. బడ్జెట్ సందర్భంగా కేంద్రం బయటపెట్టింది అంతే.. అందుకే విశాఖ ఉక్కు ఉద్యమంలో అధికారపార్టీ పెద్దగా అడుగులు ముందుకు వేయడం లేదు.