https://oktelugu.com/

తెలంగాణలో పొలిటికల్  హీట్

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటాపోటీ నెలకొంది. ఆశావహులు టికెట్ల కోసం పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. పార్టీల మద్దతు కోసం అధినేతల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటివరకు ఎవరికి వారుగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అటు పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నాయి. అధికార పార్టీ నుంచి మంత్రులు కార్యకర్తలను కూడగడుతూ మీటింగ్‌లు పెడుతున్నారు. సైనికుల్లా పనిచేసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిస్తున్నారు. అయితే.. ఈ ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులతోపాటే […]

Written By:
  • NARESH
  • , Updated On : September 23, 2020 / 09:11 AM IST

    telangana logos

    Follow us on

    తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటాపోటీ నెలకొంది. ఆశావహులు టికెట్ల కోసం పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. పార్టీల మద్దతు కోసం అధినేతల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటివరకు ఎవరికి వారుగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అటు పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నాయి. అధికార పార్టీ నుంచి మంత్రులు కార్యకర్తలను కూడగడుతూ మీటింగ్‌లు పెడుతున్నారు. సైనికుల్లా పనిచేసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిస్తున్నారు. అయితే.. ఈ ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులతోపాటే ఇండిపెండెంట్లు కూడా చాలావరకే రంగంలోకి దిగాలని రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

    Also Read: కేటీఆర్ సీఎం కావడం కల్ల.!?

    వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌‌ ఉమ్మడి జిల్లాల కోటాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఓటరు నోటిఫికేషన్‌ కూడా విడుదల కావడంతో టికెట్‌, పార్టీల మద్దతు కోసం తమ ప్రయత్నాల్లో వేగం పెంచారు.  అటు పార్టీలు కూడా ఈ ఎన్నికల విషయంలో దూకుడు పెంచాయి. నల్లగొండ స్థానంలో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ పోటీకి సిద్థమయ్యారు. ఇద్దరూ తమ పార్టీ నేతలు, సంఘాల ప్రతినిధులతో ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.

    అధికార పార్టీ టీఆర్‌‌ఎస్‌ అభ్యర్థుల విషయాల్లో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతనైతే ఇవ్వలేదు. కానీ.. క్యాడర్‌‌ను మాత్రం సంసిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో నియోజకవర్గ స్థాయిల్లో నిర్వహిస్తున్న సమావేశాలకు మంత్రులు హాజరవుతున్నారు. నియోజకవర్గాల్లో పట్టభద్రులను వీలైనంత ఎక్కువ సంఖ్యలో ఓటర్లుగా చేర్చేందుకు ఎంతలా కృషి చేయాలో అంతలా చేస్తున్నారు. అయితే.. నల్లగొండ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ నేతలు తక్కల్లపల్లి రవీందర్‌‌రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు సోదరుడు ప్రదీప్ రావు, సీనియర్‌‌ జర్నలిస్టు పీవీ శ్రీనివాస రావు, నల్లగొండ ఎమ్మెల్యే సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీగా ఉన్న రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కూడా ఈ సారి పోటీ చేసే విషయంలో స్పష్టత రావడంలేదు.

    ఇక హైదరాబాద్‌ స్థానంలో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్‌రావు పోటీ చేసి ఓడిపోయారు.ఈసారి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఈ స్థానం నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఆయన కూడా ఆసక్తి చూపుతున్నారు. ఆయనతోపాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పోటీ చేస్తే బాగుంటుందని ఆయన అనుచరులు చెబుతున్నారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌ రెడ్డి, బైకాని శ్రీనివాస్‌ గౌడ్‌, నాగేందర్‌ గౌడ్‌, కాసాని వీరేశ్‌ కూడా టీఆర్‌ఎస్‌ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీ ఇప్పటికే పలు సూచనలు చేసింది.  దీంతో నల్లగొండ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, పార్టీ నేత బెల్లయ్య నాయక్‌, గూడూరు నారాయణ రెడ్డి, ఓయూ విద్యార్థి నేత మానవతా రాయ్‌ దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్‌ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, సంపత్‌ కుమార్‌, వంశీచంద్‌ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్‌, ఆ పార్టీ నేత ఇందిరా శోభన్‌ దరఖాస్తు చేసుకున్నారు. ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్‌ మాత్రం రెండు స్థానాలకూ దరఖాస్తులు సమర్పించారు.

    Also Read: కమలానికి దూరంగా ‘చేతి’కి గులాబీలు!

    ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జర్నలిస్టులూ బరిలోకి దిగాలని అనుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ హైదరాబాద్‌ స్థానం నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. నల్లగొండ స్థానం నుంచి యువ తెలంగాణ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణి రుద్రమ రెడ్డి పోటీకి సిద్ధమయ్యారు. సీపీఐ అభ్యర్థిగా పోటీ  చేసేందుకు జర్నలిస్టు నేత జయసారథిరెడ్డి ప్ర యత్నిస్తున్నారు. దేవేందర్‌గౌడ్‌ వద్ద పీఆర్వోగా పనిచేసిన హరి శంకర్‌గౌడ్‌, కాకతీయ వర్సిటీ నుంచి పలువురు ఇండిపెండెంట్లుగా పోటీకి ఆసక్తి చూపుతున్నారు.

    మరో పార్టీ బీజేపీ సిట్టింగ్‌కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీగా ఉన్న రాంచందర్‌‌రావుకే మళ్లీ అవకాశం ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. ఓటర్‌ రీచ్‌ అవుట్‌ కార్యక్రమాన్ని ఆయన చాలా రోజుల క్రితమే ప్రారంభించారు కూడా. మరోవైపు ఇదే స్థానం నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని హెచ్‌ఏఎల్‌ డైరెక్టర్‌, బీజేపీ నేత మల్లారెడ్డి కోరుతున్నారు. నల్లగొండ స్థానం నుంచి మనోహర్‌రెడ్డి, పేరాల శేఖర్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, టికెట్‌ ఆశిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రసవత్తరంగా కనిపిస్తున్నాయి. ఫైనల్‌గా ఏ పార్టీ, ఏ అభ్యర్థి పైచేయి సాధిస్తాడో చూడాలి.