Nellore: చేరికల ఎఫెక్ట్: నెల్లూరు టిడిపి నేతల ఇళ్లలో సోదాలు

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 15 చోట్ల పోలీసులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోసం భారీ ఎత్తున డబ్బు నిల్వ చేశారన్న సమాచారంతోనే ఈ దాడులు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : March 4, 2024 3:04 pm

Police Raids In TDP Leaders Houses in Nellore

Follow us on

Nellore: వైసిపికి(YCP) బలమైన జిల్లాల్లో నెల్లూరు ఒకటి. గత రెండు ఎన్నికల్లో ఆ జిల్లా ఏకపక్షంగా నిలిచింది. 2019 ఎన్నికల్లో పదికి పది స్థానాలు వైసిపి దక్కించుకుంది. అటువంటి జిల్లా ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వైసీపీకి కీలకమైన నేతలు అంతా పార్టీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో వైసీపీలో ఒక రకమైన కలవరం ప్రారంభమైంది. గత ఎన్నికల్లో వైసీపీకి పనిచేసిన చాలామంది నాయకులు పార్టీని వీడారు. అందులో వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి(Vemireddy Prabhakar Reddy) లాంటి బలమైన నేతలు కూడా ఉన్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈరోజు విపక్ష టిడిపి నేతల(TDP Leaders) ఇళ్లను టార్గెట్ చేస్తూ పోలీసులు తనిఖీలు నిర్వహించడం విశేషం.

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 15 చోట్ల పోలీసులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోసం భారీ ఎత్తున డబ్బు నిల్వ చేశారన్న సమాచారంతోనే ఈ దాడులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసులు సోదాలు చేస్తున్న టిడిపి నేత విజితా రెడ్డి నివాసానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేరుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రధానంగా మాజీ మంత్రి నారాయణ, ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసాలను పోలీసులు టార్గెట్ చేసుకున్నట్లు సమాచారం. వీరిద్దరికీ ఆర్థిక సాయం అందిస్తున్న ఫైనాన్సియర్ల ఇళ్లు కూడా తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇటీవలే వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఈయన నెల్లూరు ఎంపీ స్థానానికి పోటీ చేయనున్నారు. నెల్లూరు అసెంబ్లీ స్థానానికి మాజీ మంత్రి నారాయణ పోటీ చేయనున్నారు. ఈ ఇద్దరు నేతలు ఆర్థికంగా బలవంతులే. దీంతో వైసీపీలో ఒక రకమైన కలవరం ప్రారంభమైంది. అందుకే ఇక్కడ ఎంపీగా విజయసాయిరెడ్డి పేరును జగన్ ప్రకటించారు. ఇప్పటికే సీనియర్ నేతలు అందరూ వైసీపీని వీడారు. జూనియర్లతోనే రాజకీయం చేయాలని జగన్ భావిస్తున్నారు. అయితే టిడిపిని ఎన్నికల్లో దెబ్బతీయాలంటే.. నేతల మానసిక స్తైర్యంపై దెబ్బ కొట్టాలని భావించారు. అందులో భాగంగానే పోలీసులతో తనిఖీ చేయించినట్లు తెలుస్తోంది.

గత రెండు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా దెబ్బతింది. అటువంటిది నేతల చేరికలతో అనూహ్యంగా పుంజుకుంది. ముఖ్యంగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాకతో జిల్లాలో టిడిపి బలం పెరిగింది. అటు ఆనం రామనారాయణరెడ్డి లాంటి సీనియర్ సైతం చేరడంతో గెలుపు పై నమ్మకం ఏర్పడింది. టిడిపి నేతలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుండడం.. నాయకత్వం సైతం ప్రోత్సహిస్తుండడంతో జిల్లా నేతలు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామాల క్రమంలోనే తనిఖీల పేరిట ప్రభుత్వం భయాందోళనకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల ముంగిట ఈ తరహా ప్రయత్నాలకు భయపడమని.. జిల్లాలో పదికి పది స్థానాలు సాధిస్తామని టిడిపి నాయకులు చెబుతున్నారు.