Andhra Pradesh: రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చారని వైసిపి పై ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ(YCP) అధికారంలోకి వచ్చిన తరువాతే గంజాయి చలామణి అధికమైందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే పెద్ద ఎత్తున గంజాయి పట్టుపడుతుండటం విశేషం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏదో చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. గంజాయి స్మగ్లర్లు సైతం పోలీసులపై దాడులకు సైతం వెనుకడుగు వేయడం లేదు. తాజాగా శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో అయితే గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. ఏకంగా పోలీసుల ప్రాణాలను తీసేందుకు కూడా సిద్ధమయ్యారు. గంజాయి స్మగ్లర్ల దాష్టికానికి ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
శ్రీకాకుళం జిల్లా సరిహద్దు ప్రాంతమైన గారబందలో ఒక కంటైనర్ గంజాయి లోడ్ చేసుకుని చెన్నై వెళ్తోంది. ముందస్తు సమాచారం అందుకున్న శ్రీకాకుళం టాస్క్ఫోర్స్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. రహదారిపై కంటైనర్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాహనాన్ని తనిఖీ చేయాలని.. పక్కకు ఆపాలని కోరారు. కానీ డ్రైవర్ పట్టించుకోలేదు. వారిపై వాహనాన్ని తొక్కే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఎస్సై తో పాటు ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. వెనువెంటనే స్థానికులు గుర్తించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
అయితే ఈ ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ గా దృష్టి పెట్టింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పోలీసులు అప్రమత్తమయ్యారు. జాతీయ రహదారి పొడవునా పోలీసులు ఆ కంటైనర్ ను ఆపే ప్రయత్నం చేశారు. కానీ విఫలమయ్యారు. చివరకు విశాఖ జిల్లా భీమిలి వద్ద పోలీసులు కంటైనర్ ను ఆపే ప్రయత్నం చేశారు. రోడ్డు పక్కన లారీని నిలిపివేసిన డ్రైవర్, క్లీనర్ పారిపోయారు. ఆ కంటైనర్ను తనిఖీ చేయగా 386 కిలోల గంజాయి పట్టుబడింది. మొత్తం 13 గోనెసంచుల్లో దీన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ వాహనం ఎవరిది? ఎక్కడి నుంచి గంజాయి తరలిస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? యజమాని ఎవరు? అన్న వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే విపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఏపీలో గంజాయి పెద్ద ఎత్తున పట్టుబడుతుండడం విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల ముంగిట విపక్షాలకు ఇదో ప్రచారాస్త్రంగా మారనుంది.