https://oktelugu.com/

Revanth Reddy: కాళేశ్వరం కథ కంచికేనా.. ప్రధాని ముందు రేవంత్ సంచలన ప్రకటన

కాళేశ్వరం పరిస్థితి ఏంటి? లక్షల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఆ ఎత్తిపోతల పథకం వృధా నేనా? అలాంటప్పుడు ఆ పంట పొలాలకు నీరు ఎలా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన సమాధానాలు రాలేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 4, 2024 / 03:20 PM IST

    Revanth Reddy sensational statement

    Follow us on

    Revanth Reddy: మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయి.. అన్నారం బ్యారేజ్ వద్ద ఇసుక మేటలు వేస్తోంది. సుందిళ్ల బ్యారేజీ సురక్షితం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి నేరుగా మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలించారు. అంతకుముందు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఉత్తంకుమార్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలించి, అధికారుల సమక్షంలో అక్కడి పరిస్థితిని వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాళేశ్వరం(Kaleshwaram) పరిస్థితి ఏంటి? లక్షల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఆ ఎత్తిపోతల పథకం వృధా నేనా? అలాంటప్పుడు ఆ పంట పొలాలకు నీరు ఎలా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన సమాధానాలు రాలేదు.

    ఇప్పటికే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద నాలుగు నెలలు క్రాఫ్ హాలిడే ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీటిపారుదల శాఖ అధికారులు కూడా అవే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి(BRS) ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నాశనం చేస్తున్నదని మండిపడుతోంది. ఇలాంటి క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి ముందు ఒక సంచలన ప్రకటన చేశారు.

    “గత ప్రభుత్వం ముందు చూపు లేకుండా కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. దానివల్ల మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయి. ఈ క్రమంలో దానిని ఏం చేయాలనేది అంతుపట్టడం లేదు. నిపుణుల సూచన ప్రకారం ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడి హట్టి వద్ద బ్యారేజ్ నిర్మిస్తాం. దీని ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీనికోసం మీ సహకారం కావాలని” రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం ప్రధానమంత్రి పర్యటించిన నేపథ్యంలో.. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ఆయన ముందు ఉంచారు. దానికి ప్రధానమంత్రి ఎస్ అని చెప్పలేదు. అలాగని నో అని కూడా అనలేదు..


    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నప్పుడు తుమ్మిడిహట్టి వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయింది. భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రతిపాదించిన తుమ్మిడి హట్టి దగ్గర కాకుండా భూపాలపల్లి జిల్లా పరిధిలో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించింది. సరిగ్గా గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగి పోయాయి. ఆ తర్వాత అన్నారం బ్యారేజ్ లో ఇసుక మేటలు వేసింది. అయితే వీటిని పరిశీలించిన కేంద్ర అధికారులు, రాష్ట్ర అధికారులు రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. ఎత్తిపోతల పథకం పనికిరాదని తేల్చేస్తున్నారు. అందువల్లే వీటికి మరమ్మతులు నిర్వహించే కంటే.. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మించడం మంచిదని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరి దీనికి కేంద్రం సహకరిస్తుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది.