BRS and Congress: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మొదటి విడతగా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) తొలిసారిగా బయటికి వచ్చారు. ఆయన తన తొలి పర్యటన ను తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా(Adilabad Dist) నుంచి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ లో పలు ప్రాజెక్టులను, వివిధ రకాలైన అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించారు. మంగళవారం కూడా ప్రధాని తెలంగాణలో ఉంటారు. సంగారెడ్డి ప్రాంతంలో పర్యటిస్తారు. మోడీ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం రామగుండంలో ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ను ప్రారంభించారు. 6000 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. మంగళవారం 9000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు.
సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటుచేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తారు. ఆయన పాలన తీరును ప్రశంసించారు. తెలంగాణపై బడే భాయ్ లాంటి మోడీ చల్లని చూపుండాలని కోరారు. దేశంలో మెట్రోపాలిటన్ సిటీ ల్లో ఒకటైన హైదరాబాద్ అభివృద్ధికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ మాటలు ఇలా ఉంటే.. ప్రధాని మరో విధంగా స్పందించారు.
భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని.. అవి రెండూ కలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో భారత రాష్ట్ర సమితి మొదట్లో డబ్బులు తిన్నదని.. ఇప్పుడు ఆ బాధ్యతను కాంగ్రెస్ పార్టీ భుజాలకు ఎత్తుకోబోతోందని ప్రధాని విమర్శించారు. రెండు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ, ప్రజలను దారి మళ్ళిస్తున్నాయని ఆరోపించారు. “భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇబ్బందులు అలాగే కొనసాగుతున్నాయని” ప్రధాని విమర్శించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని ప్రధాని కోరారు. బిజెపి అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన ప్రకటించారు. తెలంగాణకు కేంద్రం అండగా ఉంటుందని.. తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తుందని ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కు అయింది – నరేంద్ర మోడీ
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కవుతుంది. గతంలో మీరు తిన్నారు. ఇప్పుడు మేము తింటాం అన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా పాలనలో ఎలాంటి మార్పు లేదు. pic.twitter.com/X4khVolCDR
— Telugu Scribe (@TeluguScribe) March 4, 2024
అంతకుముందు రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి ముందు తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణాన్ని ప్రస్తావించారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణం ద్వారా ప్రజాసంపదను ఎలా దోచుకుందో వివరించారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణ ఆవశ్యకతను ప్రకటించారు. దానికి ప్రధాని ఎటువంటి ప్రకటన చేయలేదు.. కానీ అది జరిగిన కొద్దిసేపటికి ప్రధాని భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీని కలిపి విమర్శించడం విశేషం. ప్రధాని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తుమ్మిడిహట్టి నిర్మాణానికి కేంద్రం సహకరించదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.