
కరోనా మహమ్మారిపై జరుపుతున్న పోరాటంలో ప్రజల సంఘీభావం, కృతనిశ్చయం మరోసారి వెల్లడి చేయడం కోసం దేశంలోని ప్రజలంతా ఈ రోజు రాత్రి 9 గంటలకు 9 నిముషాల సేపు లైట్లను ఆపివేసి, దీపాలు వెలిగించమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు దేశంలో సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నది. ఆయన అసలు ఈ పిలుపు ఎందుకు ఇచ్చారనే విషయమై ఎవ్వరికీ వారు తమ వాఖ్యానాలు చెబుతున్నారు.
ప్రతిపక్షాలయితే ప్రధాని జరుపుతున్న మరో `ఈవెంట్ మానేజిమెంట్’ అంటు కొట్టిపారగేస్తున్నాయి. కరొనపై పోరాటంలో ఎదురవుతున్న సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే అని కూడా ఆరోపిస్తున్నాయి.
రెండు రోజుల క్రితం ప్రధాని జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో పలువురు ముఖ్యమంత్రులు వలస కార్మికులకు వసతి, ఆహారం కల్పించడం తమకు భారమవుతున్నదని అంటూ ఆర్ధిక సమయం కోరారు. ఈ బాధ్యత కేంద్రానిదే అని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసినా ఈ విషయమై ప్రధాని నుండి స్పందన లేదు.
అదే విధంగా కరోనా బాధితులకు అసమాన సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి అవసరమైన `వ్యక్తిగత రక్షణ పరికరాలు’ (పిపిఇ)లు మన దేశంలో అంతగా అందుబాటులో లేవు. అట్లాగే రోగులను ఉంచవలసిన ఐసియులో గాలి బైటకు వెళ్లకుండా ప్రత్యేక ఏసీ ఏర్పాట్లు ఉండాలి. ఇటువంటి మౌలిక సదుపాయాల గురించి అంతగా పట్టించుకోవడం లేదు.
మరోవంక, బిజెపి మద్దతు దారులైతే `దీపం వెలిగించు’ సమయానికి జ్యోతిష్యంతో సంబంధం ఏర్పరచి, తొందరలో కరోనా మహమ్మారి దేశం నుండి అదృశ్య కావడానికి దోహదపడుతుందని విశ్లేషణలు ఇస్తున్నారు.
ఇలా ఉండగా, ఈ పిలుపు వెనుక బీజేపీ పార్టీ కార్యక్రమం దాగి ఉన్నదనే అనుమానాలు కూడా వెళ్ళడి అవుతున్నాయి. సరిగ్గా 40 ఏళ్ళ క్రితం ఈ రోజున బిజెపిని ప్రారంభించారు. పార్టీ 40వ వార్షికోత్సవాలను సహజంగా అయితే భారీ ఎత్తున జరుపుకొనే ఉండేవారు. కానీ లాక్ డౌన్ కారణంగా వీలు లేకపోవడంతో దేశ ప్రజలు అందరి చేత దీపాలు వెలిగిస్తున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్నది.