తొమ్మిది నెలల గర్భిణీకి కరోనా వైరస్ సోకిన సంగతి తెల్సిందే. తాజాగా ఆమె పండంటి శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. కరోనా పేషంట్ బిడ్డకు జన్మనివ్వడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తల్లి నుంచి బిడ్డకు కరోనా సోకలేదని వైద్యులు తెలుపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఢిల్లీలోని ఎయిమ్స్ లో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న ఓ వైద్యుడికి కరోనా సోకింది. పేషంట్లను నుంచి వైద్యుడికి కరోనా సంక్రమించినట్లు తెలుస్తోంది. దీంతో వైద్యులు ముందు జాగ్రత్తగా వైద్యుడి భార్యను టెస్టు చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమె తొమ్మిది నెలలు గర్భిణీ కావడంతో వైద్యులు అప్రమత్తమై చికిత్సమయ్యారు. వీరిద్దరికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.
ఎయిమ్స్ గైనకాలజీ విభాగంలో పని చేస్తున్న వైద్య నిపుణురాలు నీర్జా భట్ల ఆ గర్భిణీకి శస్త్రచికిత్స చేసి పండంటి మగబిడ్డను బయటకు తీశారు. ఆమె డెలివరీ సమయానికంటే వారంరోజుల ముందే బిడ్డకు జన్మించినట్లు వైద్యులు వెల్లడించారు. శిశువుకు కరోనా లక్షణాలేవీ లేవని నీర్జా భట్ల తెలిపారు. పుట్టిన బిడ్డ ప్రస్తుతం తల్లితోనే ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. చక్కగా తల్లి పాలు తాగుతున్నట్లు వివరించారు. తల్లి పాల ద్వారా కరోనా సోకుతున్నట్లు ఆధారాలేవీ లేవన్నారు. బిడ్డకు పాలు పట్టే విషయంలో తల్లి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.