TTD Laddu Issue: తిరుమలలో వివాదం పెను దుమారం రేపుతోంది. రాజకీయ అంశంగా మారిపోయింది. లడ్డులో కల్తీ నెయ్యి వాడారు అన్న వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనిపై హిందూ ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం తయారీలో ఇంత పెద్ద తప్పిదం చేస్తారా అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఈ రగడ నడుస్తూనే ఉంది. అయితే లడ్డూలో కల్తీ నెయ్యి వాడారా? లేదా? అనే అసలు నిజం మాత్రం తేల్చలేకపోతున్నారు. దీంతో రోజురోజుకు ఈ సమస్య తీవ్రం అవుతోంది. ప్రపంచంలోనే హిందూ దేవాలయాల్లో అతిపెద్దది తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ లడ్డు ప్రసాదానికి ప్రత్యేక స్థానం. ఇక్కడి లడ్డు రుచి మరి ఎక్కడ ఉండదు. తిరుమల వెళ్లి వచ్చామంటే లడ్డు తెచ్చారా? అని భక్తులు అడుగుతుంటారు. అంతటి రుచి, పవిత్రత తిరుమల లడ్డు సొంతం. అలాంటి తిరుమలలో ఇప్పుడు ఏపీలో రాజకీయ అంశంగా మారిపోయింది. కలియుగ ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతినేలా ఇప్పుడు ఇది రాజకీయంగా మారడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాల్లోకి అనవసరంగా తిరుపతి వెంకన్నను లాగారు. వారికి తగిన శాస్తి జరగక మానదు అని హెచ్చరిస్తున్నారు.
* నాయకులే భక్తులు
వాస్తవానికి తిరుమల దర్శనంలో రాజకీయ నాయకులదే అగ్రస్థానం. సిఫారసు లెటర్ లతో నిత్యం స్వామి వారిని దర్శించుకుంటారు. అయితే ఇప్పుడు లడ్డు వ్యవహారం అన్ని పార్టీల్లో ఉన్న నాయకులకు వణుకు పుట్టిస్తోంది. చాలామంది నేతలు వెంకటేశ్వర స్వామిని కులదైవంగా భావిస్తారు. అవకాశం వచ్చినప్పుడల్లా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. అలాంటి వారంతా తాజా రాజకీయ పరిణామాలకు భయపడిపోతున్నారు. రాజకీయాల్లో దేవుడిని బయటకు లాగడంపై ఆందోళన చెందుతున్నారు. వెంకటేశ్వర స్వామి తో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అని అభిప్రాయపడుతున్నారు. అధికారపక్షం తో పాటు ప్రతిపక్షంలో కూడా ఇదే చర్చ నడుస్తోంది.
* నాయకుల నిరాసక్తత
ప్రస్తుతం లడ్డు వివాదం పై మాట్లాడేందుకు నేతలెవరు ముందుకు రావడం లేదు. అధికారపక్షంలో మంత్రులు కూడా జంకుతున్నారు. ప్రతిపక్షంలో సైతం ఒక రకమైన భయం కనిపిస్తోంది. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని అధికారపక్షం ఆరోపిస్తోంది. దేశంలోనే పేరెన్నికగన్న ల్యాబ్ దీనిని నిర్ధారించిందని చెబుతోంది. మరోవైపు వైసీపీపై అన్యమత ముద్ర పడింది. దీంతో ఆ పార్టీలో శ్రీవారి భక్తులైన నేతలు భయపడిపోతున్నారు. ఈ ఘటనపై స్పందించేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
* ఎవరి వాదన వారిది
నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని అధికారపక్షం చెబుతోంది. ల్యాబ్లో సైతం నిర్ధారణ జరిగిందని చెప్పుకొస్తోంది. ఇంకోవైపు దర్యాప్తు బృందాన్ని సైతం ఏర్పాటు చేసింది. విపక్షం మాత్రం అందుకు అంగీకరించడం లేదు. జగన్ కనీసం దానిపై విచారం వ్యక్తం చేయడం లేదు. అదంతా రాజకీయ కుట్ర అని ఆరోపిస్తున్నారు. పొలిటికల్ డైవర్షన్ గా అభివర్ణిస్తున్నారు. అయితే అధినేతలు ఇలా ఉంటే.. కిందిస్థాయి నేతలు మాత్రం దీనిపై మాట్లాడేందుకు సైతం అంగీకరించడం లేదు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Politics with god laddu tension for ap leaders
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com