TTD Laddu Issue: తిరుమలలో వివాదం జాతీయ స్థాయిలో సైతం తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై వైసీపీ కార్నర్ అవుతోంది. మరోవైపు జగన్ ఉన్నపలంగా తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. ఏపీలోని కూటమి ప్రభుత్వంపై, సీఎం చంద్రబాబు పై జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టిటిడి చైర్మన్ గా వ్యవహరించిన కరుణాకర్ రెడ్డి సైతం మీడియా ముందుకు వచ్చారు. ఇదంతా చంద్రబాబు కుట్రగా అభివర్ణించారు. అయితే ఇంతటి క్లిష్ట సమయంలో జగన్ బాబాయ్, తొలి నాలుగేళ్లు టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి ఎక్కడా కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. సొంత పార్టీలో సైతం చర్చకు దారితీస్తోంది.వై వి సుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చి ఖండించడంలో విఫలమయ్యారని.. ఆయన హయాంలోనే నెయ్యి కల్తీ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. ఇటువంటి సమయంలో ఆయన జగన్ వెంట ఉండకపోవడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కనీసం జగన్ పర్యటన రద్దయిన తర్వాత కూడా..ఆయన మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఆక్షేపించాల్సి ఉండాల్సిందని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగేళ్లపాటు వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా వ్యవహరించారు. వై వి సుబ్బారెడ్డి తీరుపై అప్పట్లో విమర్శలు వ్యక్తమైనా, విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా జగన్ ఎన్నడు ఆయనను మార్చలేదు. రాజకీయ కారణాలతో చివరి ఏడాది కరుణాకర్ రెడ్డిని టిటిడి చైర్మన్ గా నియమించారు. అయితే తాజా వివాదం నేపథ్యంలో నాలుగేళ్ల పాటు పదవిలో ఉన్న వైవి సుబ్బారెడ్డి పెద్దగా స్పందించడం లేదు. ఏడాది పదవీకాలం అనుభవించిన కరుణాకర్ రెడ్డి మాత్రం అధికార పక్షానికి ధీటుగా ముందుకు సాగుతున్నారు. వైసిపి హయాంలో అసలు తప్పు జరగలేదని ప్రతిజ్ఞ చేస్తూ ఆయన దీపారాధన చేశారు. కానీ ఆ స్థాయిలో వైవి సుబ్బారెడ్డి స్పందించిన దాఖలాలు లేవు.
* ఎన్నెన్నో అనుమానాలు
లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కలిపారు అన్నది ప్రధాన ఆరోపణ.దీంతో కూటమి ప్రభుత్వం విజిలెన్స్,సిట్ లను ఏర్పాటు చేసింది. విచారణకు ఆదేశించింది. అయితే తనపై నమోదైన విజిలెన్స్ విచారణను నిలిపివేయాలని వైవి సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇది కూడా వైసీపీకి డామేజ్ తెచ్చే అంశమే. ఒకవైపు తప్పు జరిగిందనిఅధికారులు రంగంలోకి దిగితే.. విచారణ వద్దని వైవి సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించడం ఏంటన్న ప్రశ్న సొంత పార్టీ నుంచి వినిపిస్తోంది. జగన్ తో పాటు కరుణాకర్ రెడ్డి దూకుడుగా ఉంటే.. వై వి సుబ్బారెడ్డి మెతక వైఖరి అవలంభించడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
* ఒక్కసారి మాత్రమే మీడియా ముందుకు
లడ్డు వివాదం తర్వాత ఒకే ఒక్కసారి వైవి సుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. అటు తరువాత కనిపించకుండా పోయారు. నెయ్యిలో కల్తీ జరగలేదని ఆయన స్పష్టంగా చెప్పలేకపోవడం వైసీపీకి మైనస్ గా మారింది. అటు భక్తుల్లో సైతం ఒక రకమైన అనుమానం ప్రభలుతోంది. ఇప్పటికైనా ఈ విషయంలో వైవి సుబ్బారెడ్డి ఫుల్ క్లారిటీ ఇవ్వాలని భక్తుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే సుబ్బారెడ్డి తీరుతో జగన్ కు రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. వై వి సుబ్బారెడ్డి తీరు నచ్చక ప్రకాశం జిల్లాలో చాలామంది వైసిపి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఏకంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా లడ్డు వ్యవహారం నడిచింది. ఇటువంటి సమయంలో ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన ముఖం చాటేస్తుండడంతో వైసీపీకి భారీ డ్యామేజ్ జరుగుతోందని సొంత పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More