Crime News : మీరేం మనుషుల్రా బాబూ.. స్కూల్ బాగు కోసం పసి బాలుడితో అంతటి దారుణం చేయడానికి మనసెలా ఒప్పింది?

మంత్రాలకు చింతకాయలు రాలవు. తంత్రానికి రాళ్లు కరగవు. వెనకటికి పెద్దలు చెప్పిన మాట ఇది. కానీ ఇది ఆ మూర్ఖులకు అర్థం కానట్టుంది. పైగా నేటి సైన్స్ యుగంలోనూ క్షుద్ర పూజలంటూ పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. చివరికి మనుషుల ప్రాణాలు కూడా తీస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 28, 2024 10:58 am

Crime News

Follow us on

Crime News : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సహజంగానే నిరక్షరాస్యత ఎక్కువగా ఉంటుంది. అక్కడ రకరకాల మూఢనమ్మకాలు రాజ్యమేలుతూ ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ఓ దారుణం జరిగింది. క్షుద్ర పూజల పేరుతో హథ్రాస్ ప్రాంతంలో రెండవ తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడిని చంపేశారు.. ఆ విద్యార్థి చదువుతున్న పాఠశాల అభివృద్ధి చెందాలంటే.. ఒక మనిషి ప్రాణాన్ని బలి ఇవ్వక తప్పదని భావించారు. అందులో భాగంగానే స్కూల్ హాస్టల్ లో ఆ బాలుడిని హత్య చేశారు. ఈ ఘటన సరిగ్గా వారం క్రితం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయిన విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం.. వారు తమ దర్యాప్తు ద్వారా ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ క్రమంలో పాఠశాల యజమాని జశోధన్ సింగ్, అతడి కుమారుడు దినేష్ భాఘెల్ తో పాటు ముగ్గురు ఉపాధ్యాయులను అరెస్టు చేసినట్టు పోలీసులు వివరించారు..

ఇంతకీ ఏం జరిగిందంటే..

హథ్రాస్ లోని రస్ గవాన్ ప్రాంతంలో డిఎల్ పబ్లిక్ స్కూల్ పేరుతో ఒక పాఠశాల నడుస్తోంది. ఆ పాఠశాలలో కృతార్థ్ అనే బాలుడు రెండవ తరగతి చదువుతున్నాడు అయితే కృతార్థ్ కు ఆరోగ్యం బాగోలేదని గత సోమవారం అతడి తండ్రి కృష్ణన్.కు పాఠశాల నుంచి ఒక ఫోన్ వచ్చింది. దీంతో అతడు పాఠశాలకు వెళ్ళగా.. ఆ బాలుడిని పాఠశాల డైరెక్టర్ తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాడని వార్డెన్ వివరించాడు. దీంతో హాస్టల్ దగ్గరే కృతార్థ్ కోసం తండ్రి కృష్ణన్ ఎదురు చూడటం మొదలుపెట్టాడు. ఈలోగా పాఠశాల సిబ్బంది ఒకరు వచ్చి నీ కొడుకు చనిపోయాడని కృష్ణన్ కు చెప్పారు. అంతేకాదు అతని కారులో ఉన్న కృతార్థ్ మృతదేహాన్ని కృష్ణన్ కు అప్పగించారు. అయితే తన కొడుకు హఠాత్తుగా విగత జీవిగా పడి ఉండడంతో కృష్ణన్ తట్టుకోలేకపోయాడు. వెంటనే దీని వెనుక ఏం జరిగిందో వెలికి తీయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా అసలు విషయాలు వెలుగు చూశాయి..

క్షుద్ర పూజలపై నమ్మకం

స్కూల్ డైరెక్టర్ తండ్రి దినేష్ కు క్షుద్ర పూజల మీద మొదటి నుంచి నమ్మకం ఉండేది. స్కూల్ బాగుపడాలంటే నరబలి జరగాలనే నిర్ణయానికి దినేష్ వచ్చాడు. ఇందులో భాగంగా కృతార్థ్ ను చంపాలని నిర్ణయించుకున్నారు. తన ప్రణాళికలో భాగంగా ఆ బాలుడిని ముందుగా పాఠశాల బయట ఉన్న భావి దగ్గర చంపాలని భావించారు.. కానీ వసతి గృహం నుంచి బయటికి తీసుకెళ్తుండగా కృతార్థ్ గట్టిగా అరిచాడు. దీంతో ఆ బాలుడిని అక్కడే గొంతు నులిమి చంపేశారు.. పాఠశాలకు సమీపంలో క్షుద్ర పూజలకు సంబంధించిన కొన్ని వస్తువులు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూస్తాయి.. అయితే పాఠశాలను లాభాల్లోకి తీసుకురావడం కోసం నిర్వాహకులు క్షుద్ర పూజలు చేయించాలని గతంలో నిర్వహించారు.. సెప్టెంబర్ 6న 9వ తరగతి విద్యార్థినిని బలి ఇవ్వాలని చూశారు. కానీ ఆ ప్రణాళిక బెడిసి కొట్టింది. చివరికి కృతార్థ్ కు మాయమాటలు చెప్పి చంపేశారు. ” పాఠశాల అభివృద్ధిలోకి రావాలంటే మెరుగైన సదుపాయాలు ఉండాలి. ఈ విషయాన్ని మర్చిపోయి పాఠశాల నిర్వాహకులు క్షుద్ర పూజలను నమ్ముకున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన విద్యార్థినిని చంపేశారు. ఈ కేసు దర్యాప్తులో మరికొన్ని విషయాలు తెలుస్తున్నాయి. త్వరలోనే మరిన్ని ఆధారాలు రాబడతామని”పోలీసులు చెబుతున్నారు.