Modi-Chandrababu-Pawan: సార్వత్రిక ఎన్నికలకు బిజెపి సమర శంఖం పూరించింది.జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 400 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని నిర్ణయించుకున్నారు. బిజెపి శ్రేణులు ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీని మరోసారి ఎన్నుకున్నారు. అటు స్టార్ క్యాంపెయినర్లను సైతం ఎంపిక చేశారు.దేశవ్యాప్తంగా మోడీ హాజరయ్యే బహిరంగ సభలు, రోడ్ షోలకు సంబంధించిన రూట్ మ్యాప్ పై కసరత్తు పూర్తి చేశారు.దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా ప్రధాని పర్యటనలు ఉన్నట్లు సమాచారం.
మార్చి మొదటి వారంలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నట్లు తెలుస్తోంది. మార్చి 2న ఏపీ, తెలంగాణల్లో ప్రధాని మోదీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఆరోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగిందని.. ఏపీ చీఫ్ పురందేశ్వరి, తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డిలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. ఆయనతో కలిసి చంద్రబాబు, పవన్ వేదిక పంచుకోవడం ఖాయంగా తెలుస్తోంది.
జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. అటు బిజెపితో సైతం చంద్రబాబు చర్చలు జరిపారు. బిజెపి కూటమిలోకి వచ్చేందుకు సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈనెల 21న చంద్రబాబు పొత్తులపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా బిజెపి, జనసేన లకు 30 అసెంబ్లీ సీట్లు, 10 లోక్ సభ స్థానాలు కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పొత్తు ప్రకటన వచ్చిన తర్వాత ఎన్డీఏలోకి టిడిపి ఎంట్రీ లాంఛనమే. ఈ మూడు పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తాయి. ప్రధాని మోదీ పర్యటనలో చంద్రబాబుతో పాటు పవన్ సైతం వేదిక పంచుకోవడం అనివార్యం.