PM Modi Diwali Celebrates: ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 2014 నుంచి ప్రతి సంవత్సరం దీపావళి పండుగను సరిహద్దు ప్రాంతాల్లో సైనికులతో కలసి జరుపుకోవడం ఒక ప్రత్యేక సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. సియాచిన్ హిమనదిలో ప్రారంభమైన ఈ పండు వివిధ సరిహద్దు ప్రాంతాల వరకూ విస్తరించింది. ఈ ఏడాది ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో దీపావళి జరుపుకున్నారు. ఇది ఆయన దేశ భద్రతా దృక్కోణాన్ని మరింత ప్రతిబింబించింది.
గోవా నుంచి భద్రతా సంకేతం
గోవా తీరంలో నావల సింహగర్జన మధ్య దీపావళి జరుపుకోవడం కేవలం పండగ సెంటిమెంట్ మాత్రమే కాదు, భారత నౌకాదళ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించడమే ప్రధాన ఉద్దేశం. దేశీయ సాంకేతికతపై ఆధారపడి నిర్మించుకున్న ఐఎన్‌ఎస్ విక్రాంత్ సముద్ర రక్షణలో భారత స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తోంది. ఇది భారత సముద్రగర్భ వ్యూహాత్మక విస్తరణకు సాంబోధన.
నేవీ ప్రాధాన్యతపై వ్యూహాత్మక సంకేతాలు
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో గత యుద్ధాలలో వాయుసేన, భూసేన ప్రత్యేక పాత్ర పోషించగా, సముద్రరంగం రెండో ప్రాధాన్య స్థానంలో నిలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో దీపావళి వేడుకలు జరపడం ద్వారా మోదీ, భవిష్యత్ ఆపరేషన్లలో నౌకాదళం కీలక శక్తిగా ముందుకు వస్తుందని సూచించారు. ఈ చర్య భారత సముద్రతీర భద్రత అనే అంశాన్ని జాతీయ రక్షణ వ్యూహంలో మరింత ముందుకు తెచ్చింది.
పాకిస్తాన్‌కు స్ఫుటమైన హెచ్చరిక
మోదీ చేసిన వ్యాఖ్యల్లోని మూల సందేశం పాకిస్తాన్‌పై స్పష్టంగా కేంద్రీకృతమైంది. పస్ని, కరాచీ వంటి పరిమిత నౌకా స్థావరాలతో పాకిస్తాన్ భద్రతా వ్యవస్థ సున్నితంగా ఉందని ఆయన వ్యాఖ్యల ద్వారా తెలియజేశారు. 1971 యుద్ధంలో భారత నేవీ కరాచీ పోర్ట్‌ను దిగ్బంధనం చేసి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన సంఘటనతో పోలుస్తూ, భవిష్యత్తులో అదే విధమైన చర్యలు అవసరమైతే దేశం సిద్ధంగా ఉందని సంకేతాలిచ్చారు. ఇది కేవలం రాజకీయ వ్యాఖ్య కాదు.. సముద్ర భద్రతలో భారత ఆధిపత్యాన్ని స్పష్టంగా తెలియజేసే వ్యూహాత్మక సమాచారం.
యుద్ధరంగ దిశలో కీలక మార్పు..
మోదీ చేసిన ఈ పర్యటన భవిష్యత్ రక్షణ దిశలను సూచిస్తోంది. భారత సాయుధ బలగాల మధ్య సమన్వయం, సముద్ర నియంత్రణ, వాయు–ఆర్మీ వ్యూహం వంటి అంశాలు ఇప్పుడు ఒక సమగ్ర బలగ రూపకల్పనలో భాగమవుతున్నాయి. నేవీకి ఎక్కువ బాధ్యతలు అప్పగించటం ద్వారా, ప్రభుత్వం సముద్రరంగాన్ని సెక్యూరిటీ కేంద్రంగా మలుస్తోంది.
దీపావళి వంటి పర్వదినాన్ని యుద్ధ నౌకపై జరపడం ప్రజలకు ఒక శక్తివంతమైన స్మరణ. దేశ భద్రత, సైనికుల త్యాగం, మరియు స్వదేశీ సాంకేతిక శక్తిపై గర్వ భావనను పునరుద్ఘాటించడమే ఈ సందేశం యొక్క అసలు ఉద్దేశ్యం. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ‘‘తేలియాడే నగరం’’గా పేర్కొనడం, ఆ స్వావలంబన భావానికి ప్రతీక.