Jagan Foreign Tour: జగన్ ( Y S Jagan Mohan Reddy) విదేశీ పర్యటన ముగించుకొని ఎందుకు వచ్చేసారు? నాలుగు రోజులు ముందుగానే ఎందుకు వచ్చినట్టు? 15 రోజులు అని చెప్పి.. 11 రోజులకే తిరుగు ముఖం పట్టడం వెనుక కారణం ఏంటి? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. 15 రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 11న జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు. సిబిఐ కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. ఈ లెక్కన ఆయన ఈనెల 23న రావాలి. కానీ 19వ తేదీనే వచ్చేసారు. అసలు వస్తున్నట్లు అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు. ఆ పార్టీ నేత అబ్బయ్య చౌదరి ద్వారా బయటకు సమాచారం వచ్చేలా చేశారు. ఇప్పుడు అందుకే చర్చ నడుస్తోంది.
* కోర్టులో అనుమతి తీసుకుని..
జగన్ పై అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన గత 12 సంవత్సరాలుగా బెయిల్ పై ఉన్నారు. ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు సిబిఐ కోర్టు( CBI Court) అనుమతి తప్పనిసరి. అందుకే విదేశాలకు వెళ్లే క్రమంలో ఆయన కోర్టు అనుమతులు పొందుతారు. తాజా లండన్ పర్యటన నేపథ్యంలో ఆయన కోర్టులో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ కోరింది. కానీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. తప్పకుండా ఫోన్ నెంబర్ తో పాటు ఈమెయిల్ అడ్రస్ ను ఇవ్వాలని సూచించింది. అయితే అన్ని వివరాలు ఇచ్చిన జగన్ ఈనెల 11న లండన్ వెళ్లారు. కానీ 23న రావాల్సిన ఆయన ఈనెల 19న వచ్చేసారు. అయితే జగన్ పర్యటనకు సంబంధించి వైసీపీ సోషల్ మీడియా హైప్ చేస్తోంది. జగన్ జీన్స్ షర్ట్, జీన్ ప్యాంట్ ధరించడాన్ని కొత్త ఎలివేషన్లు చూపిస్తోంది. కానీ అసలు విషయం మరిచిపోయింది. ఆయన నాలుగు రోజులు ముందుగానే ఎందుకు వచ్చారు అన్న విషయం పై క్లారిటీ ఇవ్వలేకపోతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* ఫోన్ నెంబర్ ఇవ్వకపోవడం వల్ల..
జగన్మోహన్ రెడ్డి ఫోన్ నెంబర్( phone number) ఇవ్వకుండా వెళ్లిపోయారు. సిబిఐ కి ఆయన ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆయనది కాదు. పక్క వారి నంబర్ ఇచ్చి జగన్ విదేశాలకు వెళ్లిపోయారని సిబిఐ గుర్తించింది. అదే విషయంపై సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే కోర్టుకు దీపావళి సెలవులు రావడంతో ఈ పిటిషన్ విచారణకు రాలేదు. ఈరోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు ఆదేశాలను పాటించకుండా జగన్ విదేశాలకు వెళ్లిపోయినట్లు న్యాయమూర్తులు భావిస్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. మరోసారి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవచ్చు కూడా. అందుకే ఈ కేసు తీవ్రతను తగ్గించేందుకు జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజులు ముందుగానే పర్యటన ముగించుకొని వచ్చారని తెలుస్తోంది. కేవలం కోర్టుకు భయపడి వచ్చేసారని.. వచ్చిన తర్వాత ఏం జరగదని.. తప్పిదం జరిగిందని కోర్టుకు చెప్పడం ద్వారా తీవ్ర చర్యలను జగన్మోహన్ రెడ్డి తప్పించుకున్నట్లు న్యాయ వర్గాలు చెబుతున్నాయి. జగన్ పర్యటన ముగించుకొని రావడంతో కోర్టు కూడా సీరియస్ గా తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి..