Mallikarjun Kharge : మల్లికార్జున ఖర్గే హత్యకు బిజెపి కుట్ర : సంచలన వీడియో విడుదల చేసిన కాంగ్రెస్

మరోవైపు కాంగ్రెస్ విడుదల చేసిన ఆడియో లీక్ పై భారతీయ జనతా పార్టీ స్పందించింది. ఇదొక చవకబారు విమర్శ అని కొట్టిపారేసింది. హత్య రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరని, హత్యలు చేసి అధికారంలోకి రావాల్సిన ఖర్మ భారతీయ జనతా పార్టీకి పట్టలేదని స్పష్టం చేసింది.

Written By: Bhaskar, Updated On : May 7, 2023 9:00 am
Follow us on

Mallikarjun Kharge : పోలింగ్ సమీపిస్తున్న కొద్ది కర్ణాటక రాష్ట్రంలో పరిస్థితులు ఆరోగ్యంగా మారిపోతున్నాయి. నేతల పోటా పోటీ ప్రచారంతో మాటలతూటాలు పేలుతున్నాయి. ఓ వైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విస్తృతంగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. నిన్న దేశ ఐటీ హబ్ బెంగళూరు లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ బిజెపి ప్రభుత్వం పార్టీ పర్సంటేజ్ కమిషన్ తీసుకొని అవినీతికి పాల్పడింది అంటూ వార్తాపత్రికల నిండా ప్రకటనలు గుప్పిచ్చింది. ఇది చాలదన్నట్టు కరపత్రాల్లో కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చింది. దీనిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పు పట్టింది. అంతేకాదు 85% కమిషన్ తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇతరులకు నీతులు ఎలా చెబుతుందంటూ కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది.
కాంగ్రెస్ సంచలనం
రెండు పార్టీల మధ్య ఇలా పోటాపోటీగా మాటల యుద్ధం సాగుతుండగానే.. కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసింది. ఎన్నికలవేళ భారతీయ జనతా పార్టీని ఇరుకునపెట్టే ప్లాన్ రూపొందించింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ను హతమార్చేందుకు బిజెపి కుట్ర పన్నిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్ దీప్ సూర్జేవాలా సంబంధిత ఆడియోను విడుదల చేయటం ఇప్పుడు కలకలం రేపుతోంది. కర్ణాటక రాష్ట్రంలోని కలుబురిగి జిల్లా చిత్తాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి మణికంఠ రాథోడ్ మాట్లాడినట్టు ఆ వీడియోలో ఉంది. ” మల్లిఖార్జున ఖర్గే తో పాటు ఆయన పిల్లలను కూడా చంపుతాను” అని రాథోడ్ కన్నడలో అన్నట్టుగా ఆ ఆడియో లో ఉంది. ఇప్పుడు ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అంటే కాదు ఓటమిని జీర్ణించుకోలేక భారతీయ జనతా పార్టీ నాయకులు ఇలాంటి హత్య కుట్ర తెర లేపుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాథోడ్ కు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం బసవరాజ్ బొమ్మై అండదండలు ఉన్నాయని విమర్శిస్తోంది.. అయితే ఈ చిత్తాపూర్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రాథోడ్ బరిలో ఉండగా, మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నాడు. మే నెల 10న కర్ణాటక రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.
కొట్టి పారేస్తున్న బిజెపి
మరోవైపు కాంగ్రెస్ విడుదల చేసిన ఆడియో లీక్ పై భారతీయ జనతా పార్టీ స్పందించింది. ఇదొక చవకబారు విమర్శ అని కొట్టిపారేసింది. హత్య రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరని, హత్యలు చేసి అధికారంలోకి రావాల్సిన ఖర్మ భారతీయ జనతా పార్టీకి పట్టలేదని స్పష్టం చేసింది. చిత్తాపూర్ నియోజకవర్గంలో మల్లికార్జున ఖర్గే కుమారుడు ఓడిపోతాడనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి గిమ్మిక్కులు ప్లే చేస్తోందని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు.. అంతేకాదు ఆ ఆడియో క్లిప్ లో ఉన్నది రాథోడ్ వాయిస్ కాదని బిజెపి స్పష్టం చేసింది. డబ్బింగ్ ఆర్టిస్టులతో కావాలనే ఇలాంటి చౌకబారు ప్రయత్నానికి కాంగ్రెస్ యత్నించిందని బిజెపి వివరించింది. నిన్నటిదాకా కర్ణాటకలో బజరంగబళి వివాదం కొనసాగగా, ప్రస్తుతం ఆడియో టేప్ కలకలం సృష్టిస్తోంది