PIB Fact Check: దేశంలో నరేంద్రమోదీ మొదటిసారి ప్రధాని అయిన రెండేళ్లకు పెద్ద నోట్ల రద్దుతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు ఉన్న రూ.1000, రూ.500 నోట్లు రద్దు చేశారు. రూ.2000 నోట్లు కొత్తగా ముద్రించారు. వాటిని కూడా గతేడాది నిలిపివేశారు. ఇక రూ.500 నోట్లు కొత్తగా ముద్రించారు. ఇదిలా ఉంటే.. తాజాగా రూ.500 నోట్లు కూడా రద్దవుతాయని ప్రచారం జరుగుతోంది. మార్చి నుంచి రూ.500 నోట్లు కనిపించవని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. రూ.500 నోట్లు రద్దు కావని, ఎలాంటి మార్పులు కూడా ఉండవని క్లారిటీ ఇచ్చింది.
ఆర్బీఐ నుంచి రాని స్పష్టత..
ఇదిలా ఉంటే నోట్లు ముద్రించే ఆర్బీఐ మాత్రం రూ.500 నోట్ల రద్దు గురించి జరుగుతున్న ప్రచారంపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ విషయాన్ని కూడా పీఐబీ స్పష్టం చేసింది. మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మొత్తం అవాస్తవమే అని తెలిపింది. గత జూన్‌లో కూడా ఇదే విధంగా పుకార్లు వచ్చాయని తెలిపింది.
నోట్ల రద్దుపై జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని, ఇలాంటి వార్తలతో ప్రజలు గందరగోళానికి గురవుతారని పీఐబీ తెలిపింది. అధికారిక మార్గాల నుంచి మాత్రమే సమాచారం తీసుకోవాలని కోరింది. ఇది ఆర్థిక వ్యవస్థలో అనవసర భయాన్ని తొలగిస్తుందని వెల్లడించింది.