Kondagattu Pawan Kalyan: కొండగట్టు.. తెలంగాణలో ప్రముఖమైన ఆంజనేయస్వామి ఆలయం ఉన్న క్షేత్రం. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి పాలకులు కొండగట్టు అభివృద్ధిని పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత అయినా ఆలయం దశ మారుతుందని అంతా భావించారు. పదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఆలయ అభివృద్ధికి హామీలు ఇచ్చింది. కానీ, అమలు చేయలేదు. దీంతో ఆలయ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ అదికారంలోకి వచ్చింది. అయినా ఆలయ అభివృద్ధి జరగలేదు. ఇక కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ ఆలయం అభివృద్ధికి ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఎలాంటి చొరవ చూపడం లేదు. కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆలయ అభివృద్ధిపై దృష్టిపెట్టారు. తాజాగా రూ.33 కోట్లతో 96 గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు.
భక్తుల విన్నపవంతో..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు సందర్శనతో భక్తుల్లో ఆలయ అభివృద్ధి పట్ల ఆశలు పెరిగాయి. స్థానిక ఓటర్లు గెలిపించిన నాయకులు ఇప్పటివరకు చేసిన హామీలు పాటించకపోవటంతో భక్తుల్లో నిరాశ నెలకొంది. పవన్ రాక ఈ సమస్యలకు పరిష్కారం తీసుకురావచ్చని భక్తులు భావిస్తున్నారు.
నాడు బీఆర్‌ఎస్, నేడు కాంగ్రెస్..
తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ ఆలయ అభివృద్ధికి స్పందన లేదు. సదుపాయాల కల్పన, పర్యాటకంగా అభివృద్ధి, భక్తులకు వసతి కల్పనను కూడా పట్టించుకోవడం లేదు. దీంతో ఆలయ అభివృద్ధి ఆలస్యమవుతోంది.
పవన్ కళ్యాణ్ ఆలయ అభివృద్ధికి చూపుతున్న చొరవ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇది భక్తుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. స్థానిక నాయకులు చేయని పనిని పొరుగు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేస్తున్నందున.. మన నాయకులు ఇప్పటికైనా ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని భక్తులు, ప్రజలు కోరుతున్నారు.