ఏపీలో కలకలం చెలరేగింది. ఉన్నట్టుండి ప్రజలు కళ్లు తిరిగి పడిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఇలా 100 మందికి పైగా జనాలు పడిపోవడం ప్రజల్లో ఆందోళనకు దారితీస్తోంది. కొందరు మూర్ఛ లక్షణాలతో.. ఇంకొందరు సృహ తప్పి పడిపోయారని ఏలూరు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ తెలిపారు. వికారం, మానసిక ఆందోళనతో కూడా పలువురు ఆస్పత్రిలో చేరారని పేర్కొన్నారు.
Also Read: కేంద్రంతో రైతుల చర్చలు మరోసారి వాయిదా.. కొసాగుతున్న ప్రతిష్టంభన..!
శనివారం రాత్రి 12 గంటల వరకు దాదాపు 95 మంది అస్వస్థతకు గురికావడంతో ఏలూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో 22 మంది చిన్నపిల్లలు.. 40 మంది మహిళలు, 33 మంది పురుషులు ఉన్నారు. వెంటనే ఆక్సిజన్ అందించడంతో తేరుకున్నారని వైద్యులు తెలిపారు.
వెంటనే స్పందించిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సహాయక చర్యలు చేపట్టారు. అస్వస్థతకు గురైన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. విజయవాడలోనూ అత్యవసర వార్డులు ఏర్పాటు చేశారు.
మూడు రోజులుగా తాగునీరు రంగు మారి వస్తోందని.. వాటిని తాగడం వల్లే ఇలా జరిగిందని బాధితులు చెబుతున్నారు. అస్వస్థతకు నీటి కాలుష్యమే కారణమని వైద్య వర్గాలు తెలిపాయి. పరీక్షలు చేశాక నిగ్గు తేలుస్తామని తెలిపారు.
Also Read: వరదల్లో కొట్టుకుపోయిన కారు.. అదే వరదలో వికసించిన కమలం
తొలుత ఏలూరు ఒకటో పట్టణ పరిధిలోని దక్షిణ వీధిలో కొందరు అస్వస్థతకు గురవగా.. శనివారం రాత్రికి నగరంలోని పడమర వీధి, కొత్తపేట, తాపీమేస్త్రీ కాలనీ, అశోక్ నగర్, తంగెళ్లమూడి, శనివారపుపేట, ఆదివారపు పేట, అరుంధతిపేట తదితర ప్రాంతాల్లోనూ బాధితుల సంఖ్య పెరిగింది.
బాధితులు వరుసగా సృహ తప్పి పడిపోవడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. బాధితులను అంబులెన్సుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్