వరదల్లో కొట్టుకుపోయిన కారు.. అదే వరదలో వికసించిన కమలం

‘గ్రేటర్‌‌ హైదరాబాద్‌లో పోయినేడాది 99 గెలుచుకున్నం. ఈ సారి ఇంకో నాలుగైదు ఎక్కువే వచ్చేలా ఉన్నాయి. నాయకుడు ఎలా పనిచేస్తున్నాడో చూడాలి. భవిష్యత్‌ ప్రణాళిక మీద చర్చ జరగాలి’ ఇవీ.. హైదరాబాద్‌ గ్రేటర్ కార్పొరేషన్‌ ఎన్నికల కోసం నగర నడిబొడ్డున ఎల్‌బీ నగర్‌‌ స్టేడియం వేదికగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ చేసిన వ్యాఖ్యలు. Also Read:  టీపీసీసీ రేసులో జగ్గారెడ్డి.. జీహెచ్ఎంసీ ఫలితాలపై సంచలన కామెంట్స్! ‘మంత్రాలకు చింతకాయలు రాలవు’ అన్నట్లు.. ఇప్పుడు […]

Written By: NARESH, Updated On : December 6, 2020 12:41 pm
Follow us on

‘గ్రేటర్‌‌ హైదరాబాద్‌లో పోయినేడాది 99 గెలుచుకున్నం. ఈ సారి ఇంకో నాలుగైదు ఎక్కువే వచ్చేలా ఉన్నాయి. నాయకుడు ఎలా పనిచేస్తున్నాడో చూడాలి. భవిష్యత్‌ ప్రణాళిక మీద చర్చ జరగాలి’ ఇవీ.. హైదరాబాద్‌ గ్రేటర్ కార్పొరేషన్‌ ఎన్నికల కోసం నగర నడిబొడ్డున ఎల్‌బీ నగర్‌‌ స్టేడియం వేదికగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ చేసిన వ్యాఖ్యలు.

Also Read:  టీపీసీసీ రేసులో జగ్గారెడ్డి.. జీహెచ్ఎంసీ ఫలితాలపై సంచలన కామెంట్స్!

‘మంత్రాలకు చింతకాయలు రాలవు’ అన్నట్లు.. ఇప్పుడు కేసీఆర్‌‌ మాటలకూ ఓట్లు రాలే పరిస్థితి లేదని మరోసారి గ్రేటర్‌‌ ఎన్నిక వేదికగా వెల్లడైంది. ఇన్నాళ్లు తెలంగాణ వాదాన్ని నెత్తిన ఎత్తుకొని.. ప్రజల్లో సెంటిమెంట్‌ పండించారు కేసీఆర్‌‌. ఏడేళ్ల పాటు అదే పంథాలో పాలన కొనసాగించారు. కానీ.. ప్రజల్లో ప్రధానంగా ఓటర్లలో చైతన్యం వచ్చినట్లైంది. కారు టైరుకు ఓటర్లు పెద్ద పంక్చరే వేశారు.

*ఏమో పడిపోయినట్లు వేగంగా షెడ్యూల్‌ రిలీజ్‌
ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఉంది. దానికి మూడు నెలల ముందే ఎలక్షన్లు పెట్టడం తొందరపాటు చర్య. అసెంబ్లీ , లోక్ సభ ఎలక్షన్లకు నామినేషన్ల ప్రక్రియకు వారం,10 రోజులు టైం ఇస్తారు. మూడు రోజులు విత్ డ్రాలకు చాన్స్ ఉంటుం ది. కానీ.. ఈసారి జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో టైం ఇవ్వడం లేదు. మూడు రోజులే నామినేషన్లు, ఒకేరోజు విత్ డ్రా అంటే.. ఏదో కొంపలు అంటుకుంటున్నయ్‌. వెంటనే ఎలక్షన్ పెట్టకుంటే కౌన్సిల్ గడువు అయిపోతుంది అన్నట్టు షెడ్యూల్ ఇచ్చారు. దీనికి న్యాయ బద్ధత లేదు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై సర్కారు నుంచి ఒత్తిడి ఉందని స్పష్టంగా అర్థమైంది. 80 రోజులకు పైగా టైం ఉంటే.. ఇంత ఆగమాగం ఎందుకు చేస్తున్నరో సమాధానమూ లేదు ప్రభుత్వం నుంచి. దుబ్బాక ఎన్నికల ఫలితాల్లో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న టీఆర్‌‌ఎస్‌.. మంచి ఊపులో బీజేపీకి ఏమాత్రం ఛాయిస్‌ ఇవ్వకూడదనుకుంది.

*కలిసిరాని లక్‌
ఎంతో హర్రీబర్రీగా ఎన్నికలకు వెళ్లిన టీఆర్‌‌ఎస్‌కు గట్టి దెబ్బే తగిలింది. గతంలో 99 సీట్లు సాధించి ఎవరి సపోర్టు లేకుండానే మేయర్‌‌ పీఠం అధిష్టించిన టీఆర్‌‌ఎస్‌ ఈసారి 55 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. సిట్టింగ్‌లకే సీట్లు ఇచ్చి.. బీజేపీ ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఛాన్స్‌ కొట్టేయాలనే చేసిన ఆలోచన ఫలితాలివ్వలేదు. అంతేకాదు.. టీఆర్‌‌ఎస్‌ తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరాల్సి ఉన్నా.. ఎంతసేపూ బీజేపీపైనే విమర్శల దాడికి దిగారు. ఎంతసేపూ పక్కోడు దొంగదొంగ అని చెప్పడమే తప్ప.. దొరలమైన వీరు చేసిందేంటో ఎవరికీ వివరించలేకపోయారు. జిల్లాల నుంచి మంత్రులు.. ఎమ్మెల్యేలు… చివరకు గల్లీ లీడర్లను సైతం టీఆర్‌‌ఎస్‌ గ్రేటర్‌‌లో దింపింది. కానీ.. మంత్రులు ప్రచారం చేసిన చోటల్లా..అందులోనూ కేటీఆర్‌‌ ఎక్కడెక్కడైతే ప్రచారానికి వెళ్లారో ఆయా డివిజన్లలోనే టీఆర్‌‌ఎస్‌ ఓటమి పాలుకావాల్సి వచ్చింది.

*నిండా ముంచిన వరదలు
ఇటీవల హైదరాబాద్‌లో వచ్చిన భారీ వరదలే టీఆర్‌‌ఎస్‌ ఓటమికి కారణాలని ఎవరిని అడిగినా చెబుతారు. అంత పెద్ద స్థాయిలో వరదలు వచ్చినా.. కనీసం ప్రభుత్వం నుంచి పరామర్శలు కానీ.. ప్రభుత్వం నుంచి సాయం కానీ అందలేదు. దీంతో వరదల్లో చిక్కుకున్న కాలనీల వాసులంతా టీఆర్‌‌ఎస్‌ మీద కోపంతోనే ఉన్నారు. వరదల తర్వాత ఆయా కాలనీలకు వెళ్లిన టీఆర్‌‌ఎస్‌ లీడర్లకు ఏ స్థాయిలో చేదు అనుభవం ఎదురైందో కూడా తెలిసిందే. నింపాదిగా పరామర్శలకు వెళ్లిన నేతలను ఎక్కడికక్కడ నిలదీశారు. అంతెందుకు గ్రేటర్‌‌ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వెళ్లిన నేతలకూ చేదు అనుభవం ఎదురైంది. ఎలక్షన్ల నేపథ్యంలో ప్రభుత్వం కొద్దిపాటి సాయం ప్రకటించినా.. అది పేదల చేతికి పూర్తిస్థాయిలో చేరలేదు. వాటినీ దళారులు.. కార్పొరేటర్లే గద్దల్లా తన్నుకుపోయారు. ఆ కోపం కూడా ప్రజల్లో నాటుకుపోయింది. తర్వాత ఆన్‌లైన్ ద్వారా అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌‌ చేస్తామని చెప్పి రెండు రోజులైనా ఇవ్వకుండానే.. బీజేపీ మీద నిందలు మోపుతూ ఆ సాయాన్ని కూడా నిలిపేశారు. చివరకు వరదలు వచ్చిన ఒక్క డివిజన్‌లో కూడా విజయం సాధించలేకపోయింది.

Also Read: ఎంఐఎంతో పొత్తుపై కేసీఆర్ వ్యూహాత్మక మౌనం!

*కేసీఆర్‌‌ ఊహలకు చెక్‌
గ్రేటర్‌‌ ఎన్నికల్లో గులాబీ సత్తా చాటి.. మరోసారి దేశ రాజకీయాల్లో ప్రవేశించాలని చూశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌‌. అందుకే.. ప్రచార సభలోనూ ప్రధాని మోడీ టార్గెట్‌గానే మాట్లాడారు. దేశంలో పాలనను టార్గెట్ చేసి మాట్లాడారు. ఈ గ్రేటర్‌‌ ఎన్నికల తర్వాత మరోసారి ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి.. ఉద్యమం ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. దేశ రాజకీయాల్లోకి వెళ్తానని మరోసారి ప్రకటించడంతో.. ఇక ఈ గ్రేటర్‌‌ ఎన్నికల ఊపుతో కేటీఆర్‌‌ సీఎం అయినట్లేనని అందరూ భావించారు. కానీ.. కేసీఆర్‌‌ ఆశలన్నీ మరోసారి అడియాసలే అయ్యాయి.

*పుంజుకున్న బీజేపీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ పార్టీలో కొత్త ఊపు కనిపిస్తోంది. సంజయ్‌ బాధ్యతలు చేపట్టాక వచ్చిన మొట్టమొదటి ఎన్నిక దుబ్బాక ఉప ఎన్నిక. అందులో గెలుపొంది పార్టీని ఓ స్థాయికి చేర్చారు. అంతేకాదు.. ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై కత్తులు నూరుతూనే ఉన్నారు. ‘సారు.. కారు.. ఇక రారు’ అంటూ ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్‌‌ ఎన్నికల్లో తనదైన శైలిలో టీఆర్‌‌ఎస్‌కు ఝలక్‌ ఇచ్చారు. ఇన్నాళ్లు కేసీఆర్‌‌ వేసిన ట్రాక్‌లో పడి ఇతర పార్టీల నేతలు కొట్టుకునే వారు. కానీ.. ఈ గ్రేటర్‌‌ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ట్రాప్‌లోనే టీఆర్‌‌ఎస్‌ పడాల్సిన పరిస్థితి వచ్చింది. టీఆర్‌‌ఎస్‌ నేతలు చేసిన ఆరోపణలకు ఏమాత్రం తీసిపోకుండా బదులిస్తూ వచ్చారు. చివరకు సక్సెస్‌ కాగలిగారు.

*బీజేపీకి ప్లస్‌ అయిన జాతీయ నేతల ప్రచారం
ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలపై కన్నేసిన బీజేపీ.. అందులో భాగంగా అంతోఇంతో ఓటు బ్యాంకు ఉన్న తెలంగాణను టార్గెట్‌ చేసింది. దీనికితోడు కేసీఆర్‌‌ మాటిమాటికి కేంద్రాన్ని దూషించడం.. ప్రధానిపై నిందలు వేయడం బీజేపీ జాతీయ స్థాయి నేతలకు నచ్చలేదు. అందుకే కేసీఆర్‌‌ నోటి దూలకు తాళం వేయాలని కేవలం ఒక్క కార్పొరేషన్‌ ఎన్నిక కోసం మహామహులు ప్రచారం రంగంలోకి దిగారు. చివరకు హోం శాఖ మంత్రి అమిత్‌ షా కూడా వచ్చి ప్రచారం చేశారు. జనాల్లో ఊపును తెచ్చారు.

*టార్గెట్‌ 2023 ఎలక్షన్స్‌
2023 ఎలక్షన్స్‌ టార్గెట్‌గా బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే దుబ్బాక, గ్రేటర్‌‌లో డక్కీమొక్కీలు తిన్న టీఆర్‌‌ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. గ్రేటర్‌‌ విజయం తర్వాత కూడా ఆపార్టీ నేతలు అదే ప్రకటించారు. ఒకవేళ కేంద్రం కనుక జమిలి ఎన్నికలకు పోతే ఓ సంవత్సరం ముందుగానే ఎన్నికలు వస్తాయి. దీంతో ఇదే ఊపుతో ఆ ఎన్నికలకు సిద్ధపడేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోంది.

*పట్టునిలుపుకున్న ఎంఐఎం
మరోవైపు గ్రేటర్‌‌లో ఎన్ని విమర్శలు వచ్చినా.. మరెన్ని ఇబ్బందులు వచ్చినా ఎంఐఎం పార్టీ మాత్రం తన పట్టును నిలుపుకుంది. ఇప్పటికే హైదరాబాద్‌ కేంద్రంగా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఎంఐఎం పార్టీ.. మధ్యప్రదేశ్‌లో పలు సీట్లు సాధించింది. ఇక ఈ ఎన్నికల్లోనూ తన సిట్టింగ్‌ సీట్లను మరోసారి దక్కించుకుంది.

Also Read: కేంద్రంతో రైతుల చర్చలు మరోసారి వాయిదా.. కొసాగుతున్న ప్రతిష్టంభన..!

*కాంగ్రెస్‌కు పీసీసీ చీఫ్‌ రాజీనామా
ఇక తెలంగాణను ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మాత్రం దయనీయంగా తయారైంది. గత ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధించిందో.. ఈ ఎన్నికల్లోనూ అవే సీట్లతో ఆ సిట్టింగ్‌లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముందు నుంచి పార్టీ తరఫున సీనియర్లందరూ ప్రచారంలో పాల్గొనలేదు. ఉన్న కొద్ది పాటి లీడర్లు ప్రచారం చేసినా పెద్దగా ఫలితాలు సాధించలేకపోయారు. దీంతో ఇప్పటికే దుబ్బాక ఫలితంతో పీసీసీ పదవికి రాజీనామా చేస్తూ ఉత్తమ్కుమార్‌‌రెడ్డి హైకమాండ్‌కు లెటర్‌‌ పంపారు. కానీ.. దానిని ఇంకా ఆమోదించలేదు. తాజాగా.. గ్రేటర్‌‌లోనూ ఊహించని స్థాయిలో ఓడిపోవడంతో ఆ రాజీనామాను ఆమోదించాలని హైకమాండ్‌కు మొరపెట్టుకున్నారు. దీంతో తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకం తప్పనిసరి కానుంది.

*4 నుంచి 48కి.. 99 నుంచి 55కు..
దుబ్బాక ఉప ఎన్నికలో విజయంతో బీజేపీ మంచి ఊపులో కనిపిస్తోంది. ఇక గ్రేటర్‌‌లోనూ అదే జోరు కొనసాగించింది. గడిచిన ఎన్నికల్లో 4 సీట్లకే పరిమితమైన బీజేపీ.. ఈ ఎన్నికల్లో ఏకంగా 48 డివిజన్లను కైవసం చేసుకుంది. పోలింగ్‌ కు కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఇచ్చినా బీజేపీ తన ప్రత్యర్థి టీఆర్‌‌ఎస్‌ను మట్టి కరిపించింది. 48 డివిజన్లలో గెలుపొంది.. మరెన్నో డివిజన్లలో సెకండ్‌ స్థానానికి పరిమితమైంది. అంటే దీన్ని బట్టి చూస్తే.. బీజేపీ ఓటు బ్యాంకు పెరిగినట్లుగా అర్థమవుతోంది. ఇక టీఆర్‌‌ఎస్‌ గ్రాఫ్‌ మాత్రం ఊహించని స్థాయికి పడిపోయింది. 99 డివిజన్లతో ఉన్న పార్టీ ఇప్పుడు 55కు పరిమితమైంది.

*రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు
గ్రేటర్‌‌ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువస్తుందా..? అంటే రాజకీయ నిపుణులు అవుననే అంటున్నారు. బీజేపీ ఇదే ఊపును కొనసాగిస్తే మాత్రం భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశాలూ లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు.. ఇప్పటికే టీఆర్‌‌ఎస్‌ ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అనేది నిరూపితమైంది.

*రిజల్ట్‌ హంగ్‌
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి గ్రేటర్‌‌ ఓటర్లు వినూత్న తీర్పునిచ్చారు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీని ఇవ్వలేదు. 55 సీట్లతో అతిపెద్ద పార్టీగా టీఆర్‌‌ఎస్‌ ఉన్నా.. మేయర్‌‌ పీఠం కైవసం చేసుకునేందుకు మ్యాజిక్‌ ఫిగర్‌‌ చేరలేదు. మరోవైపు బీజేపీకి 48 సీట్లు వచ్చినా ఆ పార్టీకి మేయర్‌‌ పీఠం దక్కే అవకాశాలు ఏ కోషానా లేవు. ఇక వీరిద్దరి మధ్యలో ఇప్పుడు 44 స్థానాల్లో విజయం సాధించిన ఎంఐఎం పార్టీ కింగ్‌ మేయర్‌‌ అయింది. ముఖ్యంగా ఆ పార్టీ క్యాండిడేట్స్‌ ఎవరికి మద్దతిస్తే ఆ పార్టీ అభ్యర్థే మేయర్‌‌ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు అనేది మరోసారి రుజువైంది. ఇప్పటివరకు ఏడేళ్లుగా ప్రతి ఎన్నికలోనూ గెలుస్తూ వస్తున్న టీఆర్‌‌ఎస్‌కు.. అటు దుబ్బాక.. ఇటు గ్రేటర్‌‌ వాసులు షాక్‌ ఇవ్వడంతో కొంతలో కొంతైనా మార్పు వస్తుందేమో చూడాలి..!!

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

-శ్రీనివాస్.బి