CM Jagan Meetings: జగన్ సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. బలవంతపు జన సమీకరణ చేస్తున్నా.. కొద్దిసేపు హాజరై పరారవుతున్నారు. అధికారులు, పోలీసులు అడ్డగించినా బారికేడ్లు దాటి వెళ్లిపోతున్నారు. గత కొద్దిరోజులుగా జగన్ ఏ జిల్లాకు వెళుతున్న ఇదే సీన్లు రిపీట్ అవుతున్నాయి. ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. దీనికి వైసీపీ అనుకూలురు ఎల్లోమీడియా స్రుష్టేనని కొట్టిపారేస్తున్నారు. అనుకూల మీడియా మాత్రం జన ప్రభంజనమంటూ ఆకాశానికెత్తేస్తోంది. అయితే జగన్ సభ నుంచి జనం పరారవడం తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని వైసీపీ కేడర్ లోలోపల మధనపడుతోందట. ఒకనాడు జగన్ కోసం ఎగబడిన జనం నేడేందుకు గోడలు దూకి మరీ పరారవుతున్నారని ఆ పార్టీ కార్యకర్తలు అంతర్మథనం చెందుతున్నారట. తమ లెక్క ఎక్కడో తప్పుతోందని భయపడుతున్నారట. తొలుత తిరుపతి సభలో జనం ప్రమాద ఘంటికలు పంపగా.. నిన్నటి ఏలూరు సభలో మరింత క్లారిటీ ఇచ్చరాు. మరోసారి జనం తమ ప్రతాపాన్ని చూపారు.
ఎన్నికలకు సిద్ధం కావాలని..రెండేళ్లు జనం మధ్య ఉండాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. ఇప్పటి నుంచి తానూ జిల్లాల్లో పర్యటిస్తానని.. అందుకు భారీ ఏర్పాట్లు చేయాలని సైతం ఆదేశాలిచ్చారు. అందుకే ఎప్పుడు అమరావతి నుంచి మీట నొక్కి పథకాలు ప్రారంభించే జగన్ జనం బాట పట్టాలని నిర్ణయించడంతో వైసీపీ నేతలు తెగ సంబరపడిపోయారు. సీఎం బయటకొస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారని భావించారు. జిల్లాలకు వస్తే తమకు రాజకీయంగా మైలేజ్ వస్తుందని నమ్మకంగా ఉండేవారు. అయితే జగన్ సమావేశాలకు జనం ముఖం చాటేయడంతో డిఫెన్ష్ లో పడిపోయారు. నిజానికి జగన్ సభలకు జనాన్ని పోగేయడానికి రకరకాల ప్రయత్నాలు సాగుతున్నాయి. చివరకు బెదిరింపులకు సైతం దిగుతున్నారు. సభలకు రాకపోతే ఫైన్ వేస్తామనే హెచ్చరికలు సైతం జారీచేస్తున్నారు. ఇంత చేస్తున్నా జనాలు మాత్రం భయపడడం లేదు. విద్యాదీవెన పేరుతో తిరుపతి ఎస్వీ యూనివర్సీటీలో ఏర్పాటుచేసిన సభ నుంచి అయితే జనం పరుగులు తీస్తూ బయటకు వెళ్లిపోవడాన్ని చూసిన వైసీపీ నేతలకు అసలు నోటిమాటే రాలేదు. తమ పని అయిపోయిందిరా దేవుడా అంటూ వారు నైరాశ్యంలోకి వెళ్లిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Also Read: YSRCP -Rajya Sabha: ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ సభ్యుల ఎంపికలో వైసీపీ వ్యూహమేంటి?
సమీకరణలో సరిగమలు..
తిరుపతి ‘విద్యా దీవెన’సభకు అయతే ప్రైవేటు విద్యా సంస్థల నుంచి విద్యార్థులను, డ్వాక్రా సంఘాల మహిళలను రప్పించాలని నిర్ణయించి… అధికారులకు టార్గెట్లు పెట్టారు. ఆ అధికారులు కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిడి పెంచారు. ‘సభకు రాకపోతే జరిమానా కట్టాల్సిందే’ అంటూ రిసోర్స్ పర్సన్లు డ్వాక్రా మహిళలను హెచ్చరించారు. ఆ వాయిస్ రికార్డులన్నీ వైరల్‌గా మారాయి. సీఎం సభకు మీ గ్రామ సమాఖ్యలో ఉండే సభ్యులంతా రావాల్సిందే. సీఎం ప్రోగ్రాం చాలా క్రిటికల్. జాయింట్ కలెక్టర్ జూం సమావేశం పెట్టారు. బస్సులు ఏర్పాటుచేశారు. బస్సులో స్నాక్స్, లంచ్ ప్యాక్‌లు ఇస్తారు. మీటింగ్ పూర్తయ్యే దాకా లేవకుండా కూర్చోవాలి. సీఎం మాట్లాడేటప్పుడు.. చెప్పినప్పుడు చప్పట్లు కొట్టాలి! అంటూ మెప్మాలో పనిచేసే ఓ కమ్యూనిటీ ఆర్గనైజర్ బెదిరించిన ఆడియో వాట్సాప్‌ల్లో షికారు చేసింది. ఇది చాలదన్నట్టు ‘సీఎం మీటింగ్‌కు ప్రతి గ్రూప్ నుంచి ఐదుగురు సభ్యులు కచ్చితంగా హాజరు కావాలి. అలా హాజరు కాకపోతే ఒక్కొక్కరూ రూ.500 చొప్పున ప్రతి సంఘం రూ.2500 చెల్లించాలి.
లేకపోతే మీరు వేరే రీసోర్స్‌పర్సన్ పరిధిలోకి వెళ్లండి. పై అధికారులు చెప్పినప్పుడు వారి ఆదేశాలను మేం పాటించాలి. మీరు మా ఫోన్లను ఎత్తకపోయినా పర్వాలేదు. సీఎం సభకు రాకపోతే రాకపోతే 500 చొప్పున డబ్బులివ్వండి. ఆ డబ్బులు వేరే వాళ్లకు ఇచ్చి జనాలను తీసుకెళ్తాం. ఇందులో దయాదాక్షిణ్యాలు లేవు!’’ అంటూ బెదిరింపులకు దిగడంతో జనానినికి జగన్ పరిపాలన సంగతేంటో అర్థమైపోయింది. ఈ ఆడియోలన్నీ బయటకు రావడంతో వైసీపీ కేడర్‌ను ఇరకాటంలో పడింది. పోనీ బెదిరించో బతిమాలో జనాన్ని తీసుకువచ్చినా జనం కాసేపు కూడా కూర్చోలేకపోయారు. జగన్ మైక్ అందుకోకముందే గోడలు దూకి మరీ పరారవడం ఇప్పడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కొద్ది నిమిషాలకే కదిలిపోయారు
ఏలూరు జిల్లా గణపవరం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ సభలో తిరుపతి సీన్ రిపీట్ అయింది. సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగానికి ముందే గ్రౌండ్ కొంత ఖాళీ అయితే…ఆయన మాట్లాడటం మొదలుపెట్టిన పది నిమిషాలకే ఒక్కసారిగా కుర్చీలు వదిలి జనం బయటకు వెళ్లిపోవడం కనిపించింది. బస్సుల్లో ప్రజలను తరలించుకురాగలిగినా, వారిని కుర్చీల్లో మాత్రం కూర్చోబెట్టలేకపోయారు. చివరకు పోలీసులను కూడా తోసుకుని ప్రజలు బయటకు వెళ్లిపోయారు. దీంతో సభలో రైతులు అసలు ఉన్నారా అనే సందేహం అధికారులకే వచ్చింది. అయితే జగన్ అనుకూల మీడియా.. అందునా సాక్షిలో అయితే సీఎం సభలకు జన నీరా‘జనం’, అశేష జనవాహినిలో భాగం అన్న బాక అయితే కనిపిస్తోంది. అంతటితో ఆగకుండా ఎల్లోమీడియా స్రుష్టేనని సైతం కౌంటర్ ఇస్తున్నారు. వైసీపీ శ్రేణులు లోలోపన బాధపడుతున్నా.. అదంతా అభూతకల్పనగా భావిస్తున్నారు. జగన్ సభలో జనం గురించి వైసీపీ వాళ్లు ఆరోపిస్తున్నట్టు పచ్చ మీడియా కల్పనే అయితే అబద్ధాన్ని చూసి భయపడడం అనవసరం. ఒకవేళ నిజమే అయితే అది జనం హెచ్చరిక. సరిదిద్దుకునే అవకాశం ఇస్తున్న హెచ్చరిక.గ్రౌండ్ రియాల్టీని గుర్తించని వాళ్లంతా చరిత్ర పుస్తకాల్లో మిగిలిపోతారన్న విషయం గుర్తించుకోకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు.
Also Read:R Krishnaiah: విఫల ప్రయోగాన్ని నమ్ముకున్న జగన్.. ఆర్.క్రిష్ణయ్య రాజ్యసభ ఎంపిక వెనుక కథా ఇదా?
Recommended Videos